రోడ్డెక్కితే అరెస్ట్ చేస్తాం : డీఐజీ
జడ్చర్ల, జనంసాక్షి : సడక్‌బంద్‌కు అనుమతిలేదని,బంద్ చేయాలని రోడ్డెక్కితే అరెస్ట్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జడ్చర్లలోని 44 జాతీయ రహదారిపై గురువారం ఆయన జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌తో కలిసి భధ్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉందని, గురువారం 30వ పోలీసుచట్టాన్ని కూడా అమలుచేస్తున్నట్లు తెలిపారు. 2500 మందికి పైగా బైండోవర్ చేశామన్నారు. గతంలో బైండోవర్ చేసిన వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లు డీఐజీ వెల్లడించారు. వరంగల్, హైదరాబాద్ రీజియన్ల నుంచి 5వేల మంది పోలీసు సిబ్బందిని రప్పించామన్నారు.రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి తరలిరాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల షాడో బృందాలను మఫ్టీలో ఉంచామని ఆయన చెప్పారు.