రోహిణి కార్తెలో పెరిగిన ఉష్ణోగ్రతలు..
-రోహిణి భగభగలు వేడిగాలులు
-తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
-వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మణుగూరు,మే 30 (జనంసాక్షి)
రోహిణి కార్తెలు రోళ్ళు పగులుతాయి అనే సామెత ఈ సంవత్సరం నిజమవు తోంది. ఈనెల 25వ తేదీ నుంచి కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మొదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండకాలంలో ఎండలు తొలి రోజులలో కొద్ది కొద్దిగా పెరుగుతోంది. రోహిణి కార్తెలో సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. దీంతో మనకు పగటి పూట చుక్కలు కనిపిస్తాయి. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఇక రోహిణిలో బండలు పగిలే ఎండలకు గుండెలు దడదడా అయిపోతున్నాయి. మరి ఈ సంవత్సరం రోహిణి కార్తెలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వేడి గాలులు ఎండ వేడిమి తగ్గడం లేదు. కూలర్లు, ఏసీలు టెంపరేచర్ పెంచినప్పటికీ చల్లగా అవటం లేదు. ఈ ఎండలకు బయటికి వెళ్లాలంటే ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.
ఎండ తీవ్రత:
ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25న ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. ఈ పక్షం రోజులు అధిక వేడిగాలులు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఎక్కువగా ఉంటాయి. ఎండ తీవ్రతకు చెమటలతో శరీరం అలసిపోతుంది. బిపి షుగర్ థైరాయిడ్ ఉన్నవారు ఆరోగ్య రీత్యా తగిన శ్రద్దలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, రాగిజావ, ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉండి, కొంత ఉపశమనం లభిస్తుంది.
అలవాట్లలో మార్పు:
మనం రోజు తీసుకునే ఆహారంలో
మసాలలు వేపుళ్లు, పచ్చళ్ళు, ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినకూడదనీ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీళ్ళ సౌకర్యం ఉన్న వారు తప్పకుండా రెండు పూటల స్నానం చేస్తే మంచిది. అన్ని రకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు, తెల్లని రంగు వంటివి. తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుంచి కొంత ఉపశమనం లభించటంతోపాటు శారీరక తాపం తగ్గుతోంది. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం. చిన్నపిల్లలు వృద్ధులు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు:
ఎండలో ఎక్కువగా తిరగరాదు…
బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్ లు వాడితే మంచిది.
తగినన్ని నీళ్ళు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు తాగాలి.
వేసవికాలంలో వదులైన నూలు దుస్తులు ధరించాలి.
కారం, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలి.
ధ్యానం లేదా యోగాను ప్రాక్టీస్ చేయండి,
తగినంత నిద్ర పోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం.