రౌడీ షీటర్ హత్య కేసులో..
నిందితులు అరెస్ట్
– పాతకక్షల నేపథ్యంలో హత్య
– వివరాలు వెల్లడించిన ఏసీపీ క్రిష్ణమూర్తి
పెద్దపల్లి, ఆగస్టు16(జనం సాక్షి ) : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ నెల 8న పాత కక్ష్యల నేపథ్యంతో రౌడీషీటర్ ధనాల శివశంకర్ అలియాస్ చిన్న హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను విూడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ క్రిష్ణమూర్తి మాట్లాడుతూ.. స్థానిక హనుమాన్ నగర్ కు చెందిన రౌడీషీటర్ ధనాల శివశంకర్ అలియాస్ చిన్నతో మంథని సుమన్, సర్వేశ్, శ్రీకాంత్‌లకు గతంలో పాత కక్ష్యలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని చెప్పారు. దీంతో రెండు వర్గాలుగా ఏర్పడిన ఇరువురు అవకాశం కోసం ఎదురు చూశారన్నారు. రౌడీషీటర్ శివశంకర్ ఆగస్టు 8న పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు జరుపుకున్నారని, అనంతరం హనుమాన్ నగర్ లోని మద్యం దుకాణం వద్ద తన మిత్రులతో ఉన్న శివశంకర్ పై మంథని సుమన్ తో పాటు శ్రీకాంత్, సర్వేశ్, శ్రావన్, పవన్ లు కత్తులతో దాడి చేశారని తెలిపారు. విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారని ఏసీపీ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి నాలుగు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రక్షిత క్రిష్ణమూర్తి తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.