రౖెెతులతో సర్కారు చర్చించాలి

5

— బలవంతంగా భూసేకరణ వద్దు

– మీతో మేమున్నాం

– మల్లన్నసాగర్‌ రైతులకు కోదండరాం భరోసా

మెదక్‌,జులై 5(జనంసాక్షి): గ్రామాలను ముంచైనా ప్రాజెక్టు నిర్మిస్తామంటున్నారని, మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు డిజైనే తయారవలేదని, అలాంటప్పుడు బలవంతంగా భూసేకరణ చేయడం ఎందుకని జేఎసీ చైర్మన్‌ కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా, గ్రామాలను ముంచే నిర్ణయం తగదన్నారు. ఇక్కడ రైతులు ఆందోళనచేస్తున్‌ఆన వారికి పరిహారం విషయంలో తగిన నిర్ణయం తసీఉకోకుండా మాట్లాడడం తగదన్నారు. ముందుగా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ప్రజల ముందు పెట్టాలన్నారు. మిడ్‌ మానేరు,ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లను ముందుపూర్తి చేయాలని, బలవంతపు రిజిస్ట్రేషన్లను వెంటనే ఆపాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు. ‘మా ఊరు మాకే కావాలి..తమ పిల్లలకు నౌకర్లు లేవు..యేడ పోవలె..మా ఊరు విడవం..ప్రాజెక్టు కడ్తే అందులో ఛస్తం..గిక్కడకు ఎవర్ని రానియ్యం..ఈ ప్రాజెక్టు వద్దే వద్దు..పిల్లలను పట్టుకుని ఎక్కడకు వెళ్లాలి’ అంటూ మహిళలు కళ్లనీళ్లు పెట్టుకుంటూ పేర్కొన్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఉద్యమం ఉధృతం చేస్తున్నారు. వేములగట్టు వద్ద ప్రాజెక్టుపై ఓ

చర్చ చేపట్టారు. ఈ సదస్సులో ప్రొ. కోదండరాం పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు 14 గ్రామస్తులందరూ వచ్చారు. ఈసందర్భంగా పలువురు మహిళలు తమ ఆవేదనను పంచుకున్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు తమకు వద్దని మరోసారి స్పష్టం చేశారు. నీళ్లు లేని ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకోవాలని సూచించారు. రెండు పంటల భూమి పండుతుందని, 25 చెరువులతో పాటు పెద్దవాగు ఉందన్నారు. బంగారు భూములను వదిలి ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు ప్రత్యామ్నాయం చర్చించడానికి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలావుంటే  తెలంగాణలో భూనిర్వాసితుల సమస్యలపై పాదయాత్రలు చేపట్టాలని భూనిర్వాసితుల పోరాట కమిటీ నిర్ణయించింది.  ఈనెల 7 నుంచి 18 వరకు నాలుగు జిల్లాల్లో పాదయాత్రలు చేపట్టనున్నట్టు పోరాట కమిటీ కన్వీనర్‌ బీ వెంకట్‌ చెప్పారు. జులై 7 నుంచి 9 వరకు పాలమూరు, 12, 13 తేదీల్లో కరీంనగర్‌, 14న ఖమ్మం జిల్లాలో పాద యాత్ర చేస్తారు. ఈనెల 16 నుంచి 18 వరకు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ఫార్మా సిటీ నిర్వాసితులు సమస్యలపై పాదయాత్ర చేపడతారు.  ప్రాజెక్ట్‌ల కోసం 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే భూములు సేకరించాలని  వెంకట్‌ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 123, 124 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 2013  భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకపోతే భూములు ఇవ్వమని పాదయాత్ర సందర్భంగా రైతుల నుంచి సంతకాలు తీసుకోవాలని పోరాట కమిటీ నిర్ణయించింది.