లంక ప్రాంతాలను..
ముంచెత్తిన వరద
– గోదావరికి అంతకంతకు పెరుగుతున్న ఉధృతి
– లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
– నాటుపడవల నిషేధంతో వరద బాధితుల ఇక్కట్లు
– పశువులు వరదల్లో చిక్కుకుపోవడంతో రైతుల ఆవేదన
పోలవరం, ఆగస్టు18(జనం సాక్షి) : గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని గోదావరి తీర లంక గ్రామాలు ముంపుతో అల్లాడుతున్నాయి. వరద ఉద్ధృతి దృష్ట్యా అధికారులు నాటు పడవల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో లంక గ్రామాలకు వెళ్లేవారికి, లంక గ్రామాల నుంచి ఇవతలి తీరానికి వచ్చే వారికి ఇబ్బందులు పెరిగాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి తీరంలోని లంక గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పశ్చిమ గోదావరిజిల్లా ముఖద్వారం సిద్ధాంతం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. లంకల్లో పంట పొలాలున్న వారు, పాడిపశువులున్నవారు వెళ్లటానికి మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆచంట మండలం పరిధిలోని అయోధ్యలంక, పుచ్చల్లంక, రాయిలంక, మర్రిమూల, భీమలాపురం, పల్లెపాలెం, పెదమల్లంక, అనగారిలంక గ్రామాల వద్ద గంటగంటకూ గోదావరి మట్టం పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులు కావాలన్నా గోదావరి దాటి రావాల్సి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. గోదావరి దాటి రావాలంటే వీరికి నాటు పడవలే దిక్కు. గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తచర్యగా గోదావరిలో పడవలు తిరగకుండా రాకపోకలు నిషేధించటంతో లంక గ్రామాలకు బయటి ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దాంతం వద్ద గోదావరి లోపల లంకల్లో సుమారు 500 వరకు పాడిపశువులు చిక్కుకుపోయాయి. గడిచిన నాలుగురోజులుగా గోదావరి పెరుగుతుండటంతో రైతులు వాటి ఆలనా,
పాలనా చూసే అవకాశం లేకపోయింది. తమకు జీవనాధారమైన పాడిపశువులు వరదల్లో చిక్కుకుపోయాయని, కనీసం వాటి పరిస్థితి ఎలా ఉందో తెలియకుండా ఉందని రైతులు వాపోతున్నారు. తమ జీవనాధారమైన పశువులను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ముంపులోనే కోనసీమ లంక గ్రామాలు..
తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో పలు లంక గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాల ప్రజలు బయటకు రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుబీడుం, జి.పెదపూడి, కె.ఏనుగుపల్లిలంక, శివాయిలంక కాజ్‌వేలు వరదనీటిలో ముంపు బారిన పడ్డాయి. లంక భూముల్లోని పలు పంటలు ముంపుబారిన పడ్డాయి. అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం వద్ద కాజ్‌వే నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగతోంది. అత్యవసర పనులు ఉన్నవారు మోకాళ్ల లోతు నీళ్లలో నుంచి నడుచుకుంటూ ప్రమాదకర స్థితిలో కాజ్‌వే దాడుతున్నారు.
ముంపు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు..
గోదావరి వరదల ముంపు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. అమలాపురంలో 4, రాజమండ్రిలో 2, రంపచోడవరంలో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. కాగా… వరదల కారణంగా ఇప్పటి వరకు 832 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కలెక్టర్ తెలిపారు.
కాలుజారి గోదావరిలో గల్లంతయ్యాడు ..
తూర్పుగోదావరిజిల్లా పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లి వద్ద గోదావరిలో యువకుడు గల్లంతయాడు. ఆర్.ఏనుగుపల్లికి చెందిన చొల్లంగి సోమశేఖర్(32) ఏళ్ల యువకుడు శనివారం ఉపాధి నిమిత్తం ఖతార్ వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. గ్రామంలో వైనతేయ గోదావరి చెంతన ఉన్న దుర్గాదేవిని దర్శించుకుని అనంతరం బహిర్భూమికి వెళ్లాడు. అక్కడ కాలు జారి వైనతేయ గోదావరిలో కొట్టుకుపోయాడు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. భర్త గల్లంతవ్వటంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి సంఘటనా ప్రదేశానికి చేరుకుని గల్లంతైన సోమశేఖర్ ఆచూకీ కోసం గాలించాలని అధికారులను ఆదేశించారు.