లండన్ నుంచి బ్రసెల్స్ కు నీరవ్ మోదీ!
ఇంటర్‌పోల్ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న నీరవ్
లండన్, జూన్14(జనం సాక్షి) : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ నుంచి బ్రసెల్స్‌కు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సింగపూర్ పాస్‌పోర్ట్‌పై అతను అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. నిజానికి లండన్‌లో నీరవ్ మోదీ రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నించాడు. అతడు తమ దేశంలోనే ఉన్నాడని, ఈ విషయంలో ఇండియాకు పూర్తిగా సహకరిస్తామని యూకే కూడా హావిూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలన్నీ పత్రికల్లో రావడంతో అతడు మంగళవారం, బుధవారం లండన్ నుంచి బ్రసెల్స్‌కు పారిపోయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వెల్లడించింది. అతడు లండన్‌లోనే ఉన్నాడన్న బ్రిటన్ ప్రభుత్వం అధికారిక సమాచారం కోసం ఇండియన్ హై కమిషన్ వేచి చూస్తున్న సమయంలోనే నీరవ్‌మోదీ బెల్జియంకు పారిపోవడం గమనార్హం. తన దగ్గర ఉన్న సింగపూర్ పాస్‌పోర్ట్‌తో అతను ఎప్పటికప్పుడు స్వేచ్ఛగా యూకే నుంచి బయటకెళ్లి మళ్లీ వస్తున్నట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన రూ.13500 కోట్ల స్కామ్‌లో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అసలు ఈ స్కామ్ బయటపడక ముందే ఈ ఏడాది జనవరిలో అతడు దేశం వదిలి పారిపోయాడు. అతడు న్యూయార్క్ లేదా హాంకాంగ్‌లలో ఉన్నట్లు మొదట అనుమానించారు. తీరా లండన్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. సీబీఐ కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నీరవ్ సోదరుడు నిషాల్ నివాసముంటున్నాడు. అతనికి బెల్జియం పౌరసత్వం కూడా ఉంది. ఇండియన్ పాస్‌పోర్ట్ కాకుండా సింగపూర్ పాస్‌పోర్ట్‌తో అతడు దేశాలు తిరుగుతుండటంతో అతన్ని పట్టుకోవడం ఇంటర్‌పోల్‌కు కూడా కష్టమవుతున్నది. అతడు ఇండియన్ పాస్‌పోర్ట్‌ను వాడుతున్నాడో లేదో తెలియదని లండన్‌లోని ఇండియన్ హైకమిషన్ అధికారి ఒకరు చెప్పారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు అన్నీ కూడా ఇండియన్ పాస్‌పోర్ట్‌పై ఉన్నాయని, అతడు సింగపూర్ పాస్‌పోర్ట్‌పై తిరుగుతుంటే ఇక చేసేదేవిూ ఉండదని ఓ అధికారి వెల్లడించారు. అతడు ఏ పాస్‌పోర్ట్ వాడుతున్నాడన్నది యూకే ఇమ్మిగ్రేషన్‌కు మాత్రమే తెలుసని అన్నారు.