లాడెన్‌ను పాక్‌ ఆర్మీనే చంపిందా?

   – యూఎస్‌కు-పాక్‌ ఆర్మీ చీఫ్‌కు మధ్య డీల్‌
– పాక్‌ మాజీ గూఢచారి వెల్లడి
వాషింగ్టన్‌ , మే22(జ‌నం సాక్షి ) : ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే అమెరికా స్వయంగా అతని ఆచూకీ కనుక్కోలేదా? లాడెన్‌ గురించిన సమాచారాన్ని అప్పటి పాక్‌ ఆర్మీ చీఫే వారికి అందించారా? అంటే అవుననే అంటున్నారు ఓ పాక్‌ మాజీ గూఢచారి. బిన్‌ లాడెన్‌ చనిపోయే రెండు రోజులకు ముందు అప్పటి పాక్‌ ఆర్మీ చీఫ్‌ అస్ఫఖ్‌ కయానీ.. అమెరికా అధికారులతో రహస్య భేటీ నిర్వహించడం గమనార్హం. ఐఎస్‌ఐ ద్వారా లాడెన్‌ ఆచూకీ అమెరికా తెలుసుకుందా?. పాక్‌-అమెరికా మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే ఇది జరిగిందా? లాంటి ప్రశ్నలకు మాజీ ఐఎస్‌ఐ చీఫ్‌ అసద్‌ దురాని తన వద్ద ఉన్న సమాచారాన్ని మొదటిసారిగా బయటపెట్టాడు.
ఇందుకు సంబంధించి దురాని, రా మాజీ చీఫ్‌ ఏఎస్‌ దులత్‌ల మధ్య జరిగిన సంభాషణను ప్రముఖ జర్నలిస్టు ఆదిత్య సిన్హా రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ పుస్తకంలోని ‘ది డీల్‌ ఫర్‌ ఒసామా బిన్‌ లాడెన్‌’ ఛాప్టర్‌లో ఈ సంభాషణ ఉంది. తమ భూభాగంలో.. 150 కి.విూల లోపలికి అమెరికా హెలికాప్టర్లు ఎలా వచ్చాయో పాక్‌కు ఎందుకు తెలియదు?. ఈ విషయంలో అసమర్థతపై, డబుల్‌గేమ్‌పై పాక్‌ నిందలు ఎదుర్కొంది. దీని ద్వారా పాక్‌ ఏం కూడబెట్టుకుంది?. ఈ విషయాలను నేను తెలుసుకోవాలను కుంటున్నాను. పెద్ద మొత్తంలో డబ్బుల కోసం అప్పటి పాక్‌ ఆర్మీచీఫ్‌ కయాని.. లాడెన్‌ సమాచారాన్ని అమెరికాకు అందించాడని దులానితో జరిగిన సంభాషణలో దురాని ఆరోపించాడు. 9/11 దాడులకు పాల్పడి అగ్రరాజ్యాన్ని వణికించిన అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా 2011, మే2న పాకిస్థాన్లోని అబూటాబాద్‌లో మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
————————————————-