లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ముంబయి,మే 7(జ‌నం సాక్షి): దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు చివరి వరకు జోరు కొనసాగించాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ వంద పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 31 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. చివర్లో సూచీలు మరింతగా పైకి చేరాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 292.76పాయింట్ల లాభంతో 35208.14 పాయింట్ల వద్ద ముగిసి మూడు నెలల గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ 97.20 పాయింట్ల లాభంతో 10715.50 పాయింట్లకు చేరింది. ఫైనాన్షియల్‌, మెటల్స్‌, ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభపడడంతో సూచీలు లాభాల బాటపట్టాయి. దేశీయ కంపెనీల షేర్ల కొనుగోళ్లు కూడా పెరిగాయి. 2018 ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత సెన్సెక్స్‌ అత్యంత గరిష్ఠానికి చేరింది ఈరోజే. బడ్జెట్‌ సందర్భంగా అప్పుడు సెన్సెక్స్‌ 35906.66 పాయింట్లకు చేరి భారీ లాభాలను నమోదు చేసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.15 వద్ద కొనసాగుతోంది. గెయిల్‌, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంకు, హిందాల్కో, టాటా స్టీల్‌ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. లుపిన్‌, డా. రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, సిఎ/-లా తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.