లియాన్‌ బ్యాటరీ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధం

– తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషి
హైదరాబాద్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో గిగాస్కేల్‌ లియాన్‌ బ్యాటరీ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్న సీఎస్‌ ఎస్కే జోషి తెలిపారు. నీతిఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సవిూక్షలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన సన్నద్ధతను తెలిపింది. 5 గిగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు తెలంగాణ అనుకూల ప్రాంతమన్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు ఓఆర్‌ఆర్‌, విమానాశ్రయ సవిూపంలో 200ఎకరాల భూమి సిద్ధంగా ఉందని వెల్లడించారు. విద్యుత్‌, నీటి రాయితీలుసైతం ఇస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయని సీఎస్‌ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ.. దేశంలోని వాహనాలను ఎలక్ట్రిక్‌ విధానంలోకి మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. 2023 నాటికి అన్ని మూడు చక్రాల వాహనాలు ఎలక్ట్రిక్‌ విధానంలోకి… 2025 నాటికి అన్ని ద్విచక్ర వాహనాలను ఎలక్ట్రిక్‌ విధానంలోకి మార్చాలనేది కేంద్రం లక్ష్యం పెట్టుకుందన్నారు. కేంద్రం ప్రయత్నాలకు రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు.