లెష్ట్ అవిశ్వాసం పెడితే మద్దతు : మమత
కోల్‌కత : యుపిఎ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను సీపీఎం పార్టీ తోసిపుచ్చినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గడం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పార్లమెంట్‌లో వామపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపేట్టేందుకు ముందుకువస్తే మద్దతు ఇస్తామని మమత స్పష్టం చేశారు.
అవినీతి బురదలో కూరుకుపోయి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్న కేంద్రంలోని మైనార్టీ ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నం చేయవద్దని మంగళవారం విలేఖరులతో మాట్లాడిన మమత విజ్ఞప్తి చేశారు. ‘ తృణముల్ ప్రవేశపేట్టే అవిశ్వాసం తీర్మానం విషయంలో వారికి (వామపక్షాలు ) అనుమానాలేవైనా ఉంటే, వారినే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమనండి, మేం మద్దతు ఇస్తాం, అయితే, మధ్యలో కాంగ్రెస్‌తో లాలూచీపడి వెనక్కి తగ్గకూడదు. అంశం ఒక్కటే అయితే చాలు, వారి తీర్మానానికి మద్దతివ్వడానికి సిద్ధం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయమై అవసరమైతే వామపక్ష నేతలతో మాట్లాడేందుకు కోల్‌కతలోని అలిముద్దీన్ వీధిలో ఉన్న సీపీఎం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళడానికి మమత సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఎరభయ్యవ దశకంలో వీపీ సింగ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం నాటి బిజెపీ అగ్రనేత వాజ్‌పేయి, వామపక్ష ముఖ్యమంత్రి జ్యోతి బసు ఒకే వేదికను పంచుకున్నట్లు మమత గుర్తు చేశారు. లోక్‌పాల్ బిల్లు విషయంలోనూ పార్లమెంట్‌లో బిజెపి, సీపిఎం చేతులు కలిసాయన్నారు. ప్రస్తుత అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనపై బిజెపితో నూచర్చించేందుకు తాను సిద్ధమన్నారు.