లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయంలో ప్రతిపక్షాలు సర్కారును ఇరుకునపెట్టాయి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఉదయం సభ ప్రారంభం కాగానే సభ్యులంతా ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎఫ్‌డీఐల విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం సభనిర్వహణా సజావుగా సాగనివ్వాలని విన్నవించినా ప్రతిపక్షాలు వినలేదు. విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే సభ్యులు ఎఫ్‌డీఐలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశంపై ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళనల మధ్య కాసేపు సభా కార్యక్రమాలు కొనసాగాయి. అయితే సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలపడంతో డిప్యూటీ స్పీకర్‌ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు.