వంట గ్యాస్ సబ్సిడీని ఎత్తివేయాలనే ఆలోచనను వెనక్కి తీసుకోవాలి* – సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు
మునగాల, జూన్ 04(జనంసాక్షి): వంటగ్యాస్ సబ్సిడీని ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటు, కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఆయిల్, గ్యాస్ పై నియంత్రణ ఎత్తివేసిందని విమర్శించారు. ఆ తర్వాత గ్యాస్ పై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా తగ్గిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీని ఎత్తివేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం 8 శాతం పెరిగి ఒకపక్క ప్రజలు జీవన వ్యయం పెరుగుతుంటే మరోపక్క 21 కోట్ల గ్యాస్ వినియోగదారులకు కొద్దిపాటిగా ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేయడం బాధ్యతారహితం అని విమర్శించారు. దేశంలో 30 కోట్లకు పైగా వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారని , ఉజ్వల్ పథకం కింద ఉన్న 9కోట్ల గ్యాస్ వినియోగదారులకు మాత్రమే పరిమిత గ్యాస్ సబ్సిడీని వర్తింపజేసి మిగతా వారికి సబ్సిడీని ఎత్తివేయడం అన్యాయమన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఉన్న సబ్సిడీని ఎత్తివేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మరోపక్క కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రపంచ కుబేరులుగా కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుందని ఆరోపించారు. తక్షణమే వంటగ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సబ్సిడీని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.