వందశాతం ఫలితాల కోసం కృషి
ఆదిలాబాద్,మార్చి1(జనంసాక్షి): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యశాఖ కృషి చేస్తోందని డీఈవో డాక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం టాప్10లో ఉండే విధంగా కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షతో భయం తొలిగిపోతుందని అన్నారు. పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు మరింత కష్టపడి చదవాలని సలహాలు, సూచనలు అందజేస్తామన్నారు. 10జీపీఏలో తక్కువ వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరీక్ష విధానంలో మెళకువలు నేర్పుతారన్నారు. డీ, ఈ గ్రేడ్లు వచ్చిన వారు పాస్ అయ్యే విధంగా సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు. ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కాగా కొద్ది రోజుల్లోనే పదో తరగతి వార్షిక పరీక్షలకు సైతం మొదలు కానున్నాయి. మార్చి 16వ తేదీ నుంచి మొదలయ్యే పరీక్షలకు జిల్లా విద్యా శాఖ ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సమయం దగ్గర పడుతుండడంతో పరీక్ష కేంద్రాలను నిర్ణయించడంతో పాటుగా కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారు. వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఇన్విజిలెటర్స్ నియామకంతో పాటుగా ప్లయింగ్ స్కాడ్స్, రూట్ ఆఫీసర్స్‌లను నియమించారు.