వందో టెస్టులో నిరాశ పర్చిన కోహ్లీ

సెంచరీ కాకున్నా అర్థ సెంచరీ చేయకుండానే ఔట్‌
మొహాలీ,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): వందో టెస్టు ఆడుతున్న కోహ్లి 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రతిష్టాత్మక వందో టెస్టులో సెంచరీ చేస్తాడని భావించిన ఫ్యాన్స్‌కు కోహ్లి నిరాశనే మిగిల్చాడు. అయితే సెంచరీ మిస్‌ అయినప్పటికి కోహ్లి.. హనుమ విహారితో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, మయాంక్‌ లు ఔటైన తర్వాత ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఒక రకంగా వీరిద్దరి ఆటతో టీమిండియా లంచ్‌ విరామం వరకు ఆధిక్యం చూపించగలిగింది. అయితే లంచ్‌ విరామం అనంతరం లసిత్‌ ఎంబుల్డేనియా బౌలింగ్‌లో కోహ్లి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఎంబుల్డేనియా సూపర్‌ బంతికి కోహ్లి ఒక నిమిషం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. దీంతో అప్పటివరకు కోహ్లి ఆటను చూస్తూ ఎంజాయ్‌ చేసిన రోహిత్‌ శర్మ ఒక్కసారిగా షాకయ్యాడు. కోహ్లి ఔటయ్యాడని తెలిసి తల వెనకాల చేతులు పెట్టి ఎంత పని జరిగింది.. అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది. అంతముందు కోహ్లి 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో 8వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తద్వారా టీమిండియా తరపున టెస్టుల్లో 8వేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆరో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.