వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

గుడిరిహత్నూర్‌, న్యూస్‌లైన్‌: మండలంలోని తోపం గ్రామపంచాయతీ పరిధిలోని ఇన్‌కర్‌గూడ గ్రామానికి చెందిన ఉపాధి కూలీ జాడి శంకర్‌(40) వడదెబ్బ తగిలి ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. జాడి శంకర్‌ రోజూ మాదిరిగానే జాతీయ గ్రామీణ ఉపాధి పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఈ నెల 26న కూలికి వెళ్లిన అతడు వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె శివరంజిని బాలింతగా ఆయన ఇంట్లో ఉంది. రెండో కుమార్తె సీత, కుమారుడు శ్రీనివాస్‌ ఇంట్లోనే ఉంటున్నట్లుగా స్థానికులు తెలిపారు.

వడదెబ్బ తగిలిన ఈయన మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాలంటే గత రెండు వారాల నుంచి ఉపాధి కూలి డబ్బులు రానందున వెళ్లలేక పోయాడని స్థానికులు చెబుతున్నారు. కూలి డబ్బులు సరైన సమయంలో రాకపోవడంతో మెరుగైన చికిత్స అందక మరణించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.