వరదలు ఎదుర్కొనేందుకు సిద్దం
ఆదిలాబాద్,జూన్20(జనంసాక్షి): వర్షాలు వస్తే వరదలను ఎదుర్కొనేందుకు అధికారులు యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. ప్రతియేటా కడెం జలాశయం నిండడం,నీరు వృధాగా పోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో జలాశయానికి ఉన్న 18వరద గేట్లకు గ్రీసింగు చేయడం, గేట్లను ఎత్తే యంత్రాల రోప్స్‌కు కార్డింగ్‌కాంపౌడ్ పూయడం చేశారు. వరదగేట్లను పరిశీలించారు. అత్యవసర సమయంలో గేట్లను ఎత్తేందుకు ఉపకరించే వంద కె.వి జనరేటర్లను రెండింటిని పరిశీలించి సిద్ధం చేశారు. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే వరదలు ఏసమయంలోనైనా రావచ్చు కాబట్టి వరదలను ఎదుర్కొనేందుకు జలాశయాన్ని సిద్ధం చేసి ఉంచామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా వర్షౄలు లేకపోవడంతో ఇప్పటి వరకు చుక్కనీరు కూడా చేరలేదు. ఖరీఫ్ ప్రారంభం నుంచి వర్షాలు లేక నీటిరాక లేకుండా పోయింది. వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు మాత్రం ఆశాజనకంగా లేవు. అడపాదడపా చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్షాలు కురవక వాతావరణం ఇంకా చల్లబడలేదు. రైతులు విత్తనాలు విత్తుకునేందుకు ఎదురుచూస్తున్నారు. మృగశిరకార్తె మొదలై సుమారు 15 రోజులు కావస్తున్నా.. ఆశించిన వర్షాలు కురవలేదు. దీంతో గ్రామాల్లో చెరువులు, కుంటల్లోకి ఇంకా నీరు రాలేదు. అయితే రుతుపవనాల ఆగమనంతో కొన్ని నెలలుగా వేడెక్కి ఉన్న వాతావరణం కొంత చల్లబడింది. ఖరీఫ్ ప్రారంభమై 15 రోజులు గడిచిన జిల్లాలో మామాఊలు వర్షాలు కూడా లేవు. జిల్లాలో అడపాదడప వర్షం పడినా విత్తుకునేందుకు వీలుగా కురియలేదు. అయితే అదును దాటుతుందనే ఆతృతతో ఇప్పటికే అనేక మంది విత్తుకున్నారు. విత్తనాలు విత్తుకున్న రైతులు వాటిని బతికించుకునే ప్రయత్నంలో ఉండగా.. ఇంకా విత్తుకోని రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.