వరదల నివారణ లక్ష్యంగా ప్రాజక్టులు
వరదలప్రాంతాలపై అధ్యయనం చేపట్టాలి
రాజమండ్రి,ఆగస్ట్19(జనం సాక్షి): ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి ముందు ఆ ప్రాంతంలో తరచు గోదావరి నదికి వరదలు వచ్చేవి. తుపాన్లు గోదావరి జిల్లాల ప్రాంతంలో బీభత్సం సృష్టించేవి. సర్‌ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించడం ద్వారా ఆ ప్రాంతంలో విపత్తును నివారించగలిగారు. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన మూసీ వరదల తరువాత, అప్పటి నిజాం పాలకుడు, హైదరాబాద్‌కు శాశ్వత వరద నివారణ వ్యవస్థను, మంచినీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాలకుల దూరదృష్టికి ఇవి ఉదాహరణలు. ఇప్పుడు కూడా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అయితే వరదలను, విపత్తులను దృష్టిలో
పెట్టుకుని నిర్మించడంతో పాటు, చెరువులను పునరుద్దరించాలి. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా చెరువులను, కాలువలను మింగేస్తున్నారు. తెలంగాణలో నీటి పారుదల ప్రణాళికను ఇప్పుడిప్పుడే ఆధునీ కరిస్తున్నారు. నదులను, చెరువులను సంధానం చేయాలన్న వ్యూహంతో సాగుతున్నారు. ఎపిలో కూడా సిఎం చంద్రబాబు నాయుడు నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వరదలను నివారించేలా కాటన్ స్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచిది. ఈ దశలో శాశ్వత చర్యలతో పాటు తాత్కాలికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాల్సి ఉంది. అలాగే అన్నదాతలకు పరిహారం అందేలా చేయాలి. అప్పుడే మళ్లీ వారు వ్యవసాయంలోకి దిగాలన్న భరోసాతో ఉంటారు. పంటలు నష్టపోయిన వారిని ఉదారంగా ఆదుకుంటేనే మనకు భవిష్యత్‌తో మళ్లీ అన్నం పెట్టగలరు. అలాగే వరదలకు కారణమైన ఆక్రమణల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. వరదలకు వ్యాధులకు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విషజ్వరాలతో పాటు అతిసార వంటి వ్యాధులు విజృంభించాయి. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, దోమలు పెరగడం, మంచినీరు అందుబాటులో లేకపోవడం ఈ పరిస్థితికి కారణం. ఈ పరిస్థితులు కొనసాగుతుండగానే మరోసారి గోదావరి విరుచుకుపడుతోంది. ఏటా వర్షాకాలంలో పరీవాహక ప్రాంతాలు వరద ముంపు ముప్పును ఎదుర్కొంటున్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజానీకం మళ్లీ రక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా తరలివెళ్తున్న వారిలో అనారోగ్యానికి గురైన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అరకొరగా నిధులు కేటాయించడం, అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందిని పెంచకపోవడం, అవసరమైన మందులను సరఫరా చేయకపోవడంతో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ముంపు ప్రాంతాల ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడంతో పాటు, ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని సరఫరా చేయాలి. వరద పీడిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని గుర్తించి, అవసరమైన చర్యలు
తీసుకోవాలి. పభుత్వాస్పత్రుల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి.