వరదల వల్ల జరిగిన నష్టం, అభివృద్ధి పనుల పురోగతి పై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం- మేయర్ గుండు సుధారాణి


ఖిలా వరంగల్, ఆగస్ట్08(జనంసాక్షి);
మహా నగరంలో వరదల వల్ల జరిగిన నష్టంపై ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వరదల వల్ల జరిగిన నష్టం,అభివృద్ధి పనుల పురోగతి పై నియోజక వర్గాల వారిగా ఇంజనీరింగ్ అధికారులతో కూలంకషంగా సమీక్షించి సమర్ధ నిర్వహణకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ మహా నగరంలో వరద వల్ల జరిగిన నష్టంపై మంత్రి కేటీఆర్ గత శనివారం హైదరాబాద్ లో సమీక్షించి ప్రజలకు ఉపశమనం కొరకు తక్షణ సహాయంగా రూ 250 కోట్లు మంజూరు చేయడంపై మేయర్ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపారు. భారీ వర్షాల వల్ల జిడబ్ల్యూఎంసీ పరిధిలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లో వాటిల్లిన నష్ట వివరాలను సంబంధిత శాసనసభ్యుల సహకారంతో సేకరించి నివేదిక సిద్ధం చేయాలని మేయర్ అన్నారు. ఈ నెల 18 నుండి జరిగే పోచమ్మ బోనాలకు గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లలో ని దేవాలయాల్లో లైటింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహా నగరంలోపట్టణ ప్రగతి, జనరల్ ఫండ్, సిఎంఏ,15వ ఫైనాన్స్, ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్, తదితర పథకాల క్రింద కొనసాగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు టెండర్ పూర్తయి ఇంకను మొదలు కానీ పనులను తక్షణమే చేపట్టాలని అన్నారు. ఈ సమీక్ష లో బల్దియా ఎస్ఈ కృష్ణ రావు , ఈఈ లు శ్రీనివాసరావు, రాజయ్య, సంజయ్ కుమార్, డీఈ లు రవి కుమార్, సంతోష్ బాబు, సారంగం, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు