వరల్డ్ కప్ కోసం కీరవాణి పాట
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవితంపై నీరజ్ పాండే రూపొందిస్తున్న ‘ఎం.ఎస్. ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రం కోసం తయారుచేస్తున్న ‘ఫిర్ సే’ అనే పాటను వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు అంకితం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడైన ఎం.ఎం. కీరవాణి ఇప్పటికే ఈ పాటకు బాణీలు సమకూర్చగా, మనోజ్ ముంతషిర్ సాహిత్యం అందించాడు. స్వతహాగా క్రికెట్ ప్రేమికుడైన నీరజ్ ఈ పాటకు వీడియోను కూడా రూపకల్పన చేస్తున్నాడు. ప్రపంచ కప్‌లో భాగంగా ఈ నెల 15న భారత్, పాకిస్థాన్ జట్లు ఒకదానితో ఒకటి తలపడనుండగా, అదే రోజు ఆ పాటను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని నీరజ్ తెలియజేస్తూ ‘‘మొత్తం దేశపు భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ‘ఫిర్ సే’ పాట ఉంటుంది. భారత జట్టు నుంచి దేశంలోని ప్రతి ఒక్కరూ ఏం ఆశిస్తున్నారో అది ఈ పాటలో ఉంటుంది. ఇది ఒక ప్రార్థనాగీతం, ఒక ఆశయ గీతం. ఎం.ఎం. క్రీమ్ సాబ్ చాలా అందమైన బాణీలు సమకూర్చారు. మన జట్టుపై మనకుండే ప్రేమకు, దేశం కోసం మన ఆటగాళ్లు పడే తపనకు ఇది మేం అందిస్తున్న నీరాజనం’’ అని చెప్పాడు. ‘ఎం.ఎస్. ధోని’ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, టైటిల్ రోల్‌ను సుశాంత్‌సింగ్ రాజ్పుట్ పోషిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 22న ఈ చిత్రం విడుదల కానున్నది.