వర్షాలతో వరి నాట్లు ముమ్మరం
అన్నదాతలపై కరుణించిన వరుణుడు
ఏలూరు, జూలై 10: ఉభయగోదావరి జిల్లాలో మంగళవారం విస్తారంగా కురిసిన వర్షాలతో సార్వ సాగులో రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు గత నెలలోనే రాష్ట్రాన్ని తాకినా దాని ప్రభావం వల్ల గోదావరి జిల్లాల్లో వర్షాలు కురిసినట్టే కురిసి మురిపించి మటుమాయమయ్యాయి. వేసవిని తలపించేరీతిలో మండుటెండలు కాశాయి. దాంతో ఈ రెండు జిల్లాల్లోనూ నారు మళ్లు వేసుకోవడానికి రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురుచూసే పరిస్థితి తలెత్తింది. అడపాదడపా అక్కడక్కడా వర్షాలు కురిసినా నారుమళ్లకు పెద్దగా కలిసివచ్చింది ఏమీ లేకుండా పోయింది. వేసిన నారుమళ్లను బిందెలతో నీళ్లు తెచ్చుకుని తడుపుకున్న సంఘటనలు పలు ప్రాంతాలలో కనిపించాయి. ఈ రెండు జిల్లాల్లో 13లక్షల ఎకరాల్లో వరిసాగుకు సంబంధించి వేయాల్సిన నారుమళ్లలో వర్షాభావం వల్ల 40 శాతానికి మించి నాట్లు వేయలేకపోయారు. మంగళవారం కురిసిన వర్షాలు వరినాట్లు ఊపందుకునేందుకు దోహదం చేశాయి. రైతులు దుక్కిదున్నిన చేనులోకి వెళ్లినాట్లు వేసే పనులను ముమ్మరం చేశారు. మెట్ట ప్రాంతాలలో బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ వర్షాలు ఊరట నిచ్చాయి. ఐతే ఈ వర్షాలు మరో వారం రోజులు విస్తారంగా కురిస్తే కాని రైతులు పూర్తి స్థాయిలో ప్రయోజం కలగదనే చెప్పకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులో వర్షం కారణంగా పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎంతో కాలం తరువాత కురిసిన వర్షానికి నగర ప్రజానీకం సేదతీరింది. మండుటెండల ధాటికి అల్లాడిపోయిన ప్రజానీకం జోరుగా కురిసిన వర్షంలో తడుస్తూనే దైనందిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో 34.9 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదైందని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ తెలిపారు. తెరవలి, పెనుమంట్ర, పెడమర్రు, తణుకు, అత్తిలి మండలాల్లో సగటునా 70 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇరగవరం పెంటపాడు, గనపవరం, పెనుగొండ, యలమంచిలి మండలాల్లో సగటున 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు నగరంలో 47 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.