వసతి గృహానికి ప్రత్యూష
– బాలికతో కలిసి భోజనం చేసిన కేసీఆర్
– ఎప్పుడైనా రావచ్చు.. ఫోన్ చెయ్యొచ్చు
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్,జూలై 29(జనంసాక్షి):
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటికి వెళ్లిన ప్రత్యూషకు ఆదరణ లభించింది. హైకోర్టు సూచన మేరకు తల్లిదండ్రుల హింసకు గురైన ప్రత్యూషను కెసిఆర్ ఇంటికి తీసుకు వెళ్లారు. ఆమెను కెసిఆర్ దగ్గరకు తీసుకుని పూర్తి అండగా ఉంటామని చెప్పారు. ఆ తర్వాత తన తో పాటు భోజనం చేయించారు. ¬ం మంత్రి నాయిని నరసింహరెడ్డి,కడియం శ్రీహరి తదితరులు కూడా వారితో కలిసి భోజనం చేశారు. ప్రత్యూష అక్కౌంట్ లో లక్ష రూపాయలు వేయాలని, ఆమెను హాస్టల్ లో చేర్పించాలని, ఆమెకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని, ఆమె చదవుకు అయ్యే ఖర్చును మొత్తం ప్రభుత్వం భరిస్తుందని కెసిఆర్ స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహరికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ప్రత్యూష చదువుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎప్పుడైనా తన ఇంటికి రావచ్చని , తన ఫోన్ నెంబర్లు కూడా ఆమెకు ఇచ్చారు. సవతి తల్లి, తండ్రి చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై కోలుకున్న ప్రత్యూషను తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీసుకు తీసుకెళ్లాలని ఎల్బీనగర్ పోలీసులను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించారు. ప్రత్యూష అంశంపై సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలన్నారు. ప్రత్యూషను అన్ని విధాలుగా ఆదుకుంటానని గతంలో హావిూ ఇచ్చిన సీఎం కేసీఆర్ను హైకోర్టు సీజే అభినందించారు. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను పోలీసులు హైకోర్టులో హాజరుపర్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యూషతో హైకోర్టు సీజే మాట్లాడారు. అవేర్ గ్లోబల్ హస్పిటల్ చికిత్స పొందిన ప్రత్యూష పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు బుధవారం డిశ్చార్జి చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఎల్బీనగర్ పోలీసులు ప్రత్యూషను హైకోర్టులో హాజరుపరిచారు. తాను బీఎస్సీ నర్సింగ్ చదివి పేదలకు సేవల చేస్తానని చెబుతున్న ప్రత్యూష బంధువులు ఎవరి దగ్గరా ఉండేందుకు అంగీకరించ లేదు. పలు స్వచ్చంద సంస్థలు, అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రత్యూషను పరామర్శించి, తాము ఆమె బాద్యతను తీసుకుంటామని ప్రకటించిన నేపధ్యంలో కెసిఆర్ చర్యను హైకోర్టు అబినందించింది. కెసిఆర్ చొరవ వల్ల ఇలాంటి బాధితులు ఎందరికో భరోసా ఇస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కెసిఆర్ వద్దకు తీసుకు వెళ్లి ఆయన నిర్ణయం తెలియచేయాలని హైకోర్టు కోరింది. ప్రత్యూష ఆస్పత్రిలో ఉన్నప్పుడు కెసిఆర్ పరామర్శించి, తాను స్వయంగా ఆమె కు చదువు చెప్పించి, ఇల్లు కట్టించి,పెళ్లి చేస్తానని, ప్రత్యూష బాద్యతలు చూస్తానని కెసిఆర్ చెప్పారు. దీంతో ఇప్పుడు సిఎం కెసిఆర్ ఆమెను హాస్టల్లో చేర్చాలని సూచించారు.