వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, ఎంఈవో, ఆర్డీవో కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లోని ఆర్డీవో కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి సురేష్‌ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యాపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నామని చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని ఆయన ఆరోపించారు. కనీస వసతులు లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నా అధికారులు వాటి పరిష్కరించడంలో చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పాఠశాలలో, వసతి గృహాల్లో అసౌకర్యాలు నెలకొనడంతో అనేక మంది విద్యార్థులు చదవులకు దూరం కావాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం సమస్యలను పరిష్కారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేసి, శిథిలావస్థలోకి చేరిన పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.