వాట్సాప్‌ సందేశాలపై కేంద్రం నిఘా!

– రెండు వారాల్లో సమాధానం చెప్పాలన్న సుప్రీం
న్యూఢిల్లీ, జులై13(జ‌నం సాక్షి) : ఆన్‌లైన్‌ సమాచారం విూద నిఘా పెట్టడానికి కేంద్రం సోషల్‌ విూడియా హబ్‌ను ఏర్పాటు చేయడంపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించిన పిటిషనర్‌ వాదనలు విన్న కోర్టు రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించింది. కేంద్రం సోషల్‌ విూడియా హబ్‌ సాయంతో ప్రజల వాట్సాప్‌, ట్విటర్‌, ఈ మెయిల్స్‌ సందేశాలను తెలుసుకోవాలనుకుంటుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మోయిత్రా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దాన్ని విచారించిన సీజేఐ దీపక్‌ మిశ్ర, డీవై చంద్రచూడ్‌, ఏఎం ఖన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. దానిపై అటార్నీ జనరల్‌(ఏజీ) వేణుగోపాల్‌ సాయాన్ని కోరింది. ‘కేంద్రం ప్రజల వాట్సాప్‌ సందేశాల విూద నిఘా పెట్టాలనుకుంటోంది. దానివల్ల నిత్యం ప్రభుత్వ నిఘాలో ఉండే రాజ్యం ఏర్పడుతుంది’ అని బెంచ్‌ వెల్లడించింది. సోషల్‌ విూడియా హబ్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆగస్టు 20న టెండర్‌ను ప్రారంభించనుందని మోయిత్రా తన పిటిషన్‌లో వెల్లడించారు. దానికంటే ముందే ఆగస్టు 3నే దీనిపై వాదనలు వింటామని, ఈ విషయంలో ఏజీ కానీ ఇతర ప్రభుత్వ న్యాయ అధికారులు కానీ తమకు సహకరించాలని ధర్మాసనం కోరింది.