వానలు రావాలి.. కోతులు పోవాలి
– హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్
నల్లగొండ,జులై 8(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలా సాగాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు ఏ కార్యక్రమం చేపట్టినా విజయం సాధిస్తారని నిరూపించారని, ఇప్పుడు అదే స్ఫూర్తితో పచ్చని తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అన్నారు. రెండు వారాలపాటు సాగనున్న రెండో దోశ హరితహారానికి నల్గొండ జిల్లా నుంచి శుక్రవారం తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో నల్గొండ జిల్లా చౌటుప్పల్ చేరుకున్న సీఎం.. వ్యవసాయ మార్కెట్ యార్డులో 5 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ఆధునిక గోదామును ప్రారంభించి, యార్డు ఆవరణలో కదంబం మొక్కనాటారు.అనంతరం గుండ్రాయిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… లక్షమందితో ఒకే సమయంలో 1.25లక్షల మొక్కలు నాటడం సాహసం అన్నారు. ఒక్క మొక్క పెరగలేదనే మాట రాకుండా మొక్కలు బతికించాలని కోరారు. డబ్బులు కావాలంటే వస్తాయని, వానలు కావాలంటే ఎవరో అమెరికా నుంచి వచ్చి తెప్పించలేరని అన్నారు. డబ్బులు పెడితే వానలు పడవని అన్నారు. మనం అడవులను నాశనం చేయడం వల్లనే ఇవాళ వర్షౄలు పడడం లేదని గుర్తించాలన్నారు. అక్కడక్కడా వాగులు, వంకలు పారుతున్న వార్తలు కేవలం అడవులు ఉన్న ప్రాంతాలకే పరిమితం అయ్యాయని గుర్తించాలని అన్నారు. వానలు ఎందుకు పడడం లేదో గుర్తించి మొక్కలునాటేందుకు అందుకూ బముందుకు రావాలన్నారు. నల్గొండ జిల్లాలో అతి తక్కువగా 5.8 శాతంవిస్తీర్ణంలో మాత్రమే అడవులు ఉన్నాయి. అందుకే రెండో దశ హరితహారం కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లాలో విస్తృతంగా చెట్లు నాటి..అగ్రస్థానంలో నిలపాలని కోరారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు నాతోపాటు పిడికెడు మంది ఉన్నాం… అలా మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో అందరూ ఆకుపచ్చ యజ్ఞాన్ని చేపట్టాలని కోరారు. రెండు వారాలపాటు విద్యార్థుల నుంచి సీఎం వరకూ అందరూ మొక్కలు నాటడంపైనే దృష్టి సారించాలని సూచించారు. హరితహారం రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు హరితాభివందనాలు తెలిపారు. హరిత తెలంగాణ సాధన కోసం అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. లక్షన్నర మొక్కలు ఒకేసారి నాటడం గొప్ప సాహసోపేతమని పేర్కొన్నారు. అందరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సీఎం నుంచి విద్యార్థుల వరకు అందరూ ఈ హరితహారం లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కవులు, కళాకారులు కూడా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. పది రోజులపాటు అందరూ అవిరళంగా కృషి చేయాలన్నారు. పది రోజులు కష్టపడినా మొక్కలు పెరగలేదనే అపవాదు రాకుండా వాటిని కాపాడాలని సూచించారు. హరితహారంలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. జిల్లాలోని కాలువల ఆధునీకరణ కోసం తక్షణమే రూ.350 కోట్లు కేటాయిస్తున్నానని ప్రకటించారు. అడవులను మనం నాశనం చేయడం వల్లే ఇవాళ కోతులు గ్రామాలు, పట్టణాల్లోకి వచ్చి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీఎంఅన్నారు. అది కోతుల తప్పుకాదని, మనం వాటి ఆవాసాల్ని ధ్వంసం చేయడం వల్ల మనవిూద పడుతున్నాయని పేర్కొన్నారు. అడవులుంటే కోతలు గ్రామాల్లోకి రావని తెలిపారు. కాబట్టి వానలు వాపస్ రావాలని, కోతులు అడవులకు వాపస్ పోవాలని పేర్కొన్నారు. అందు కోసం మనం మొక్కల్ని నాటాలని, మొక్కలు పెరిగితే వర్షాలు కురుస్తాయని అడవుల్లో వాటికి కావాల్సిన ఆహారం దొరికితే తిరిగి అడవులకు వెళ్లిపోతాయని వివరించారు. వర్షాలు పడతలేవని మనం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపారు. ఈ సంవత్సరం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అడవులను ధ్వసం చేయడంతో పర్యావరణం సమతుల్యత దెబ్బతినడం వల్ల వానలు పడటంలేదని తెలిపారు. ఇవాళ వర్షాలు లేక రాష్ట్రమే కాదు దేశమంతా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే తెలంగాణ పచ్చబడాలని తెలిపారు. ఇందు కోసం ప్రతీ ఒక్కరూ ఈ మహా యజ్ఞంలో పాల్గొని తెలంగాణను పచ్చని తెలంగాణగా చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడైతే అడవులున్నాయో అక్కడ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. మనం కూడా వనం పెంచితే వర్షాలు వస్తాయని తెలిపారు. గుండ్రాంపల్లిలో వేప మొక్కను నాటి, నీరు పోశారు.
హరితహారం పెద్ద సాహసోపేత కార్యక్రమం
హరితహారం పెద్ద సాహసమని, జాతీయ రహదారికి ఇరువైపులా లక్ష మందితో ఒకే సమయంలో లక్ష 25 వేల మొక్కలు నాటే కార్యక్రమం అనేది మమూలు విషయం కాదని అన్నారు.గత రెండు నెలలలుగా తాను అధికారతుఓ ఈ కార్యక్రమం కోసం తీవ్ర తర్జనభర్జనచేవామని అన్నారు. ఈ రోజున ఎంత ఉత్సాహంతో మొక్కలు నాటుతున్నామో, ఆ మొక్కల సంరక్షణ అందరి బాధ్యతని అన్నారు. ఒక్క మొక్క కూడా ఎండిపోవద్దని, వంద శాతం మొక్కలను బతికించి తెలంగాణలో నల్గొండ జిల్లా నెంబర్ వన్ కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అడవులు నరకడం వల్లే కోతులు ఊర్లపైకి వచ్చాయని, విచక్షణారహితంగా అడవులు నరకడంతో వర్షాలు పడటంలేదని అన్నారు. అందుచేత హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. మొక్కను పెంచడమంటే బతుకు బాగు చేసుకోవడమేనని కేసీఆర్ అన్నారు. మళ్లీ తెలంగాణను పచ్చగ చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన మరోసారి పిలుపు ఇచ్చారు. వానలు వాపస్ రావాలి… కోతులు వెనక్కి పోవాలని, ప్రతి పాఠశాల బడి ఒక ఆకుపచ్చ ఒడి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు దీక్షా కంకణ బద్ధులై మొక్కలు నాటించాలని ఆయన సూచించారు. హరితహారం ప్రజా ఉద్యమంగా మారాలని, తెలంగాణ రాష్ట్రం పచ్చబడాలని అన్నారు. వనం ఎంత పెంచితే వర్షం అంత వస్తాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
నల్లగొండను అగ్రభాగాన నిలపాలి
నల్లగొండ జిల్లాలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో అతి తక్కువ అడవులు ఉన్నాయని, పచ్చదనం తక్కువగా ఉంది కాబట్టే ఇక్కడ నుంచి రెండో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. తాను నల్లగొండకు రావడంలో ఉద్దేశ్యం కూడా అదేనని తెలిపారు. అందరిని ప్రోత్సహించి జిల్లాలో అడవుల శాతాన్ని పెంచేందుకు తాను వచ్చానని వివరించారు. హరితహారంలో నల్లగొండ జిల్లాను ప్రజలు అగ్రస్థానంలో ఉంచుతారనే ఆశిస్తున్నానన్నారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. సభ నుంచి తిరిగి వెళ్తూ హెలికాప్టర్ ద్వారా జాతీయ రహదారి వెంట ఏరియల్ సర్వే ద్వారా హరితహారం కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు.