వానాకాలం పంటలపై సమాయత్తం కండి
` ఇందిరమ్మ ఇళ్లు,భూ భారతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష
` ఇళ్ల నిర్మాణ సామాగ్రిపై మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీల ఏర్పాటు చేయాలి
` విత్తనాలు, ఎరువుల కొతర లేకుండా చూసుకోవాలి
` వాటిని బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలి
` అవసరమైతే కల్తీ విత్తనాల నేర చరిత్ర ఉన్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
` వాటిపై రైతులకు అవగాహన కల్పించాలి
` అన్నదాతలకు చుట్టంగా మారిన భూభారతి చట్టం
` ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల్లో విజయవంతంగా అమలవుతోంది
` త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం
` ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో పర్యటించాలని ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు 15 రోజులు ముందుగా వచ్చాయని, దానికి అనుగుణంగా సన్నద్ధమై ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వానలు ముందుగా రావడం వల్ల కొన్ని చోట్ల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తాయని, రైతులు ఆందోళన చెందారని ముఖ్యమంత్రి అన్నారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు. ‘యాసంగి లో గతంలో ఎన్నడూ లేనంత ధాన్యాన్ని ప్రభుత్వం ఈసారి కొనుగోలు చేసింది. గత ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొంటే, ఈసారి ఇప్పటికే 64.50 లక్షల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని, ఇప్పటికే 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయింది…’ అని ముఖ్యమంత్రి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించామని, ఈ సీజన్లో ఇప్పటికే రూ.12184 కోట్లు చెల్లించామన్నారు. అధికారులు, జిల్లాల్లో కలెక్టర్లు సమర్ధంగా పని చేయటం వల్లనే ప్రభుత్వం ఈ విజయం సాధించిందని వారిని అభినందించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఈ ఏడాది 2.75 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించటం, మన రైతులు సాధించిన విజయమని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో భాగస్వామ్యం పంచుకున్న వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్ విభాగాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది ముందుగా వచ్చిన వర్షాలతో ధాన్యం సేకరణకు అక్కడక్కడ ఆటంకం కలిగిందని అభిప్రాయ పడ్డారు. గత ఏడాదితో పోలిస్తే 21.50 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని, మరో నాలుగైదు లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద మిగిలి ఉందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. 33 జిల్లాల్లో 21 జిల్లాల్లో ధాన్యం సేకరణ విజయవంతంగా సాగిందని, 12 జిల్లాల్లో అక్కడక్కడ ఆందోళనలు జరిగినట్లు దృష్టికి వచ్చిందని, కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళితే ఈ సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి అన్నారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు పెద్దగా ప్రచారంలోకి వస్తున్నాయని, కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేసిన ఘటనను ఉదాహరించారు. అందుకే కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను దాచిపెట్టకుండా వెల్లడిరచాలని, కలెక్టర్లు కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాలనా పరంగా తప్పులు జరిగితే, వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని, తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వాలని అన్నారు. ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టేందుకు వెనుకాడ వద్దని అన్నారు. ధాన్యం సేకరణను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైనన్ని లారీలతో రవాణా చేయాలని, అవసరమైతే స్థానికంగా గోదాములు అద్దెకు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ అత్యవసర కాన్ఫరెన్స్ లో ప్రధానంగా ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు.. నాలుగు అంశాలపై చర్చించారు.వానాకాలం ముందుగా వచ్చిందని, ఇప్పటికే ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉండటంతో రాష్ట్రంలో సుభిక్ష వాతావరణం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. సీజన్ ముందుకు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని జిల్లాలో విత్తనాలు, ఎరువులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, బఫర్ స్టాక్ ఉందా లేదా చూసుకోవలని, కలెక్టర్లు ఏరోజుకారోజు సమీక్షించుకోవాలని ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎరువులు విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని చెప్పారు. అవసరమైతే కల్తీ విత్తనాల నేర చరిత్ర ఉన్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. ఎరువులు, విత్తనాల నిల్వలు, కల్తీల విత్తనాలను అరికట్టేందుకు వీలుగా జిల్లాలో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోవాలని సూచించారు. గతంలో ధరణి రాష్ట్రంలో రైతుల పాలిట భూతంగా మారిందని, కొత్తగా ప్రజా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం రైతులకు చుట్టంగా ఉందని అన్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల్లో విజయవంతంగా అమలవుతున్న భూభారతిని త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేస్తామని చెప్పారు. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలని, రైతుల సమస్యలకు పరిష్కారాలను సూచించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రమంతటా మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల ఇన్ఛార్జీ మంత్రులు రెవిన్యూ సదస్సుల నిర్వహణ షెడ్యూలు, ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, కలెక్టర్లు తమ పనితీరును బాధ్యతగా నిర్వర్తించి ఈ పథకాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల తుది జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీల ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్, ఎంపీడీవో, కార్మిక అధికారి మరియు స్వయం సహాయక సంఘం సభ్యులతో ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మేస్త్రీల ఛార్జీలు, స్టోన్ మెటల్ వంటి ధరలను కట్టడి చేసే బాధ్యతను ఈ కమిటీ చేపడుతుందన్నారు. ఇసుక దందాతో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉచిత ఇసుక కూపన్లను సకాలంలో అందించాలని, లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్ల తయారీకి ఇందిరా మహిళా శక్తి, రాజీవ్ యువ వికాసం ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. నిరుపేద లబ్దిదారులు ఇబ్బంది పడకుండా తక్కువ ఖర్చుతో ఇండ్ల నిర్మాణం జరిగే కొత్త సాంకేతికతను అనుసరించాలని చెప్పారు. మండల కేంద్రంలో ఉన్న మోడల్ ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు చూపించాలని కలెక్టర్లకు చెప్పారు. ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి సూచించారు. ధాన్యం సేకరణ, భూభారతి రెవిన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధ ప్రణాళికపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని చెప్పారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 1 నాటికి జిల్లాల వారీగా ఈ అంశాలన్నింటితో పూర్తి నివేదికను తనకు అందించాలని మంత్రులకు, కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. అదే రోజున సెక్రెటేరియట్లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చిద్దామని చెప్పారు.