వారి సెలవు సంతోషమే
– కేజ్రీవాల్
న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి):దిల్లీలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ 200 మంది అధికారులు సెలవు పెట్టారు. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఆ అధికారులంతా సెలవు పెట్టడం ప్రజలకు ఆనందకరమని అన్నారు. వాళ్లకు జీతంతో కూడిన సెలవు ఇవ్వడానికి తాము సిద్ధంగానే ఉన్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వారు సెలవు పెడితే అయినా ప్రభుత్వం నిజాయతీగా, సమర్థంగా మారుతుందని కేజ్రీవాల్ అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంలో కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. నజీబ్ జంగ్ కూడా ఆందోళన చేస్తున్న అధికారులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో స్పీకర్ ఫోన్ ద్వారా మాట్లాడారని కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారన్న ఆరోపణలతో దిల్లీలో యశ్పాల్ గార్గ్(ప్రాసిక్యూషన్ స్పెషల్ సెక్రటరీ), సుభాష్‌చంద్ర ( స్పెషల్ సెక్రటరీ) అనే ఇద్దరు ఐఏఎస్ అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జీతాలు పెంచే దస్త్రాలపై లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆమోదించకుండానే దిల్లీ ప్రభుత్వం మాత్రం సంబంధిత అధికారులను సంతకాలు చేయాలని కోరింది. అందుకు వారు నిరాకరించడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.
కేజ్రీవాల్‌పై అధికారుల అలక..సామూహిక సెలవులు
న్యూఢిల్లీ,డిసెంబర్31(ఆర్‌ఎన్‌ఎ): ముఖ్యమంత్రి కేజీవ్రాల్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో 200 మంది అధికారులు గురువారం సామూహిక సెలవు పెట్టారు. ఇద్దరు ఐఏఎస్ అధికారులను కేజీవ్రాల్ ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సర్కార్ కేబినేట్ నిర్ణయాలపై సంతకాలు చేసేందుకు అంగీకరించకపోవడంతో ఆ ఇద్దరు అధికార్లపై వేటు పడింది. ఈ నిర్ణయం ఢిల్లీ అధికారుల్లో ఆగ్రహం తెప్పించింది. ఏడుగురు ఐఏఎస్ అధికార్లు సయితం హాఫ్‌డే సెలవు పెట్టారు.