వికలాంగులకు పరికరాలు పంపిణీ
విజయనగరం, జూలై 17: జిల్లాలో వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోనున్నదని విజయనగరం పట్టణ సభ్యురాలు బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద వికలాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగులకు ప్రోత్సాహకాలను అందించారు. ఇందులో భాగంగా 92 మంది వికలాంగులకు ట్రైసైకిళ్లు, 102 వికలాంగ జంటలకు ఒక్కొక్కరికి రూ.10వేల ప్రోత్సాహకం, 100 మందికి శ్రవణ యంత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ వికలాంగులు అథైర్యంగా ఉండరాదని అన్నారు. వికలాంగులు ఏదైనా సహాయం పొందాలనుకుంటే తక్షణమే పొందేందుకు అవసరమైన నిధులు ప్రస్తుతం పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలో 500 మంది వికలాంగుల నుంచి సహాయం కోసం దరఖాస్తులు వచ్చాయని, ఎంపి నిధుల నుంచి సహకరిస్తే వారికి లబ్ధిచేకూర్చగలమని కలెక్టర్ కోరడంతో ఎంపి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో వికలాంగ సంక్షేమ శాఖ ఎడి అచ్యుతరామయ్య, జడ్పీ సీఈఓ మోహనరావు, రాజీవ్ విద్యామిషన్ పిఓ కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్ పరిధిలో రూ.40లక్షల నిధులతో నిర్మించిన అదనపు పాఠశాల భవనాలను, పట్టణ అణగారిన పిల్లల వసతి గృహాన్ని ఎంపి ఝాన్సీలక్ష్మి ప్రారంభించారు.