విజయమ్మా.. మా సిరిసిల్లకు రాకమ్మా..
‘నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లుందమ్మ విజయమ్మా నీ తీరు.. ఓ వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలా.. నీకు తెలుసా ? ఒకప్పుడు దేశంలోనే వస్త్ర ఉత్పత్తిలో మహారాష్ట్రలోని భీవండిది మొదటి స్థానమైతే, రెండో స్థానం తెలంగాణలోని మా సిరిసిల్లది. వస్త్ర రంగంలో అంతటి ఖ్యాతిని గడించిన సిరిసిల్లను ‘ఉరి’సిల్లగా మార్చేసి, బొందల గడ్డగా తయారు చేసిన ఘనత నీ పెనిమిటి వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానిదే. నీ భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి అవలంబించిన విధానాలదే. బతికున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నీ భర్త నాడు నేతన్నలు ఒక్కరి తరువాత ఒకరు ఉరికొయ్యకు వేలాడుతున్నా, కనీసం వాళ్ల కుటుంబాలను నీ కొడుకు మాదిరి పలుకరింపులకు కూడా రాలేదని నీకు తెల్వదా ? నమ్మమంటవా ? నీ భర్త సీఎం అయినంక, ఆయన పాలించిన 2004 నుంచి 2009 వరకు 215 మంది నేతన్నలు తమ ప్రాణాలను బలితీసుకున్నరు. ఇట్ల అంతకు ముందు పదేళ్లలో ఎన్నడూ జరుగలేదు. 2004కు ముందు ప్రతిపక్ష నేతగా సిరిసిల్లకు వచ్చిన మీ ఆయన వ్యవసాయం తరువాత తన దృష్టిలో చేనేత రంగానికే ప్రాధాన్యముందని సెలవిచ్చిండు. కానీ, అధికారంలోకి వచ్చాక ఆ ముచ్చటే మరిచిండు. ఆ తరువాత నేతన్నల ఆత్మహత్యల పరంపర మొదలైనా కనీసం పరామర్శకు రాలేదు. మళ్లీ 2014 ఎన్నికలప్పుడు వచ్చి హామీలు ఇచ్చినా, అవి నేటి వరకూ నెరవేరలేదు. ఇప్పుడు ఆత్మహత్యలను మరిచిపోయి నేత కార్మికులు తమ బతుకేదో తాము బతుకుతుంటే, ఇప్పుడు నవ్వు నీ కొడుకు పెట్టిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా సిరిసిల్ల పర్యటనకు వస్తనని, నేత కార్మికుల సమస్యల సాధనకు ఒకరోజు దీక్ష చేస్తనని ఎందుకమ్మా.. మా నేత కార్మికుల పుండు మీద కారం చల్లాలని చూస్తున్నవ్ ? నీ ప్రకటన మా నేతన్నలు మండిపడుతున్నరు. నీ భర్త సీఎంగా చేసిందేం లేదు.. నవ్వొచ్చి చేసేదేం లేదని బాజాప్తా చెప్తున్నరు. నీకు వినిపిస్తలేదా విజయమ్మా..? రోజూ పేపర్లు చదువుడు బంద్ చేసినవా ఏంది ? నవ్వు వచ్చి.. మమ్మల్ని రెచ్చగొట్టి, బాధ పెట్టేకంటే.. అమ్మా.. మహాతల్లీ.. నవ్వు రాకపోతేనే మంచిదని మా నేతన్నలు అనుకుంటున్నరు. మావోళ్ల కోసం వచ్చి, నవ్వు దీక్ష చేస్తనంటే నమ్మడానికి మా నేతన్నలు, తెలంగాణవాదులు సిద్ధంగా లేరు. నీ భర్త చేసిన మోసాలు చాలు.. మా కండ్లు తెరుచుకున్నయ్.. ఇంకా నిన్నెవలు నమ్ముతరు ? నీ ఈ దీక్ష నాటకం ఎందుకోసమో మాకు తెల్వదా ? తెలంగాణలో ఈ సాకుతో నీ పార్టీని చొరగొట్టేందుకు చూస్తున్నవని, ఈ లెక్కన తెలంగాణలో మీ సీమాంధ్రుల గుత్తాధిపత్యాన్ని అట్లనే ఉంచి, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి, తెలంగాణ భూములను నీ భర్త దోచిస్తే, అప్పనంగా కాజేసి, చేసిన తప్పుకు జైలు సలాకలు లెక్కబెడుతున్న నీ కొడుకు జగన్‌ను సీఎం చేసుడే నీ లక్ష్యమని మాకెరుకె. లేకుంటే, అసలు మా నేతన్నల బాధలు నీకేం తెలుసు ? మీ సీమలో సాంచలున్నయా ? నవ్వెప్పుడన్నా కండెలు చుట్టినవా ? చర్క తింపినవా ? పోగులిర్సినవా ? బట్టలేసుకునుడు తప్పితే.. బట్టలుతుకుడు కూడా తెల్వని నీకు.. బట్టలు తయారు చేసే మా శాలోళ్ల బాధలేం తెలుస్తయ్ ? తెలుసంటే మా తెలంగాణలో నిన్నెవలు నమ్మాలె ? నమ్మితే గిమ్మితే నీ పార్టీల చేరి, మా నాలున్నర కోట్ల మందితో రోజూ శాపాలు తింటున్న నీ పార్టీ కార్యకర్తలు, నాయకులే నమ్మాలె. ఏమంటున్నవ్ తల్లీ రాజన్న రాజ్యం తెస్తవా.. మా నేతన్నలను ఆందుకుంటవా ? అంటే, నీ భర్త.. అదే రాజన్న రాజ్యం ఉన్నప్పుడు చేసుకున్నట్లు మా నేతన్నలు మళ్ల ఆత్మహత్యలు చేసుకోవాలని కోరుకుంటున్నవా ఏంది ? మా సిరిసిల్లోళ్లు చూసిన రాజన్న రాజ్యం గదే మరి ! ఆ దిక్కుమాలిన రాజ్యం మాకు, మా నేతన్నలకు అస్సలొద్దమా ! మా తెలంగాణ మాగ్గావాలె గంతే. దీనికి నువ్వు ఒప్పుకుని, తెలంగాణ ఇవ్వమని చిదంబరం సారుకు లేఖ ఇచ్చి, అప్పుడు రా మా సిరిసిల్లకు. లేకుంటే, ఈ దిక్కున మొఖం కూడా తిప్పకు. ఒకవేళ వచ్చినవనుకో మా మహబూబాబాదోళ్లు నీ కొడుకును ఎట్ల ఉరికించిన్రో తెలుసు గదా ! సిరిసిల్లకు నువ్వస్తే అదే గతైతది ! అందుకే, చెప్తున్నం విజయమా.. మా సిరిసిల్లకు రాకమ్మా..