విజయ్‌కు గరవ్నర్ ఆహ్వానం అంతులేని కథ

` మరోసారి నెలకొన్న సందిగ్ధత
` నేడు ప్రమాణస్వీకారం లేదని లోక్‌భవన్ వెల్లడి
తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్..! ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి పూర్తిగా వీడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. లోక్‌భవన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు.. తొలుత కాంగ్రెస్, తాజాగా సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించడంతో మెజార్టీ మార్కును చేరుకున్నట్లయింది. అయితే, వీసీకే అధికారికంగా లేఖ ఇవ్వకపోడం వల్లే ఈ సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, శనివారం (మే 9న) ఉదయం 11గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారని సీపీఎం నేత కె.బాలకృష్ణన్ వెల్లడించారు. ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తాజా పరిణామంతో ప్రమాణస్వీకారం ఎప్పుడనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
వామపక్షాలకు విజయ్ థాంక్స్
వామపక్షాలు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగింది. దీంతో గవర్నర్‌తో సమావేశం ముగిసిన వెంటనే విజయ్ నేరుగా చెన్నైలోని సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు వెళ్లారు. తనకు మద్దతు ప్రకటించిన ఉభయ కమÖ్యనిస్టు పార్టీల నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.మరోవైపు, ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా.. తాజాగా సీపీఎం, సీపీఐ, వీసీకే సమ్మతి తెలపడంతో విజయ్ సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీల వారీగా సంఖ్యాబలాలు పరిశీలిస్తే.. టీవీకే : 107; కాంగ్రెస్ : 5; సీపీఐ : 2; సీపీఎం : 2; వీసీకే : 2.
బయటి నుంచే మద్దతు.. మంత్రివర్గంలో చేరం: లెఫ్ట్
టీవీకేకు బయట నుంచే తాము మద్దతిస్తామని.. ప్రభుత్వంలో చేరబోమని సీపీఎం నేత యు.వాసుకి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విÖడియాతో మాట్లాడుతూ.. “సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు ఈ రోజు సమావేశమయ్యాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు బయటి నుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో టీవీకేకు మద్దతుగానే కచ్చితంగా ఓటు వేస్తాం. కానీ, మంత్రివర్గంలో మాత్రం చేరం. ఇది కేవలం బయటి నుంచి మద్దతే. వామపక్షాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని వీసీకే సైతం చెప్పింది. అందువల్ల వారు కూడా అదే తరహాలో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. ప్రజలు టీవీకేకు అధిక మెజార్టీ ఇచ్చారు.. వారి విశ్వాసం మేరకు ప్రభుత్వ ఏర్పాటు కోసమే మేం మద్దతు తెలుపుతున్నాం. ప్రజా సమస్యల ఆధారంగానే మేం స్వతంత్రంగా వ్యవహరించి పనిచేస్తాం. లౌకికవాదం, ప్రజల ఐక్యత, రాష్టాల హక్కులు.. ఇలా ఇతర ఏ అంశమైనా సరే ప్రస్తావనకు వచ్చినప్పుడు మాతో కలిసొచ్చే ఏ లౌకిక పార్టీతోనైనా కలిసి నడుస్తాం” అని తెలిపారు.

 

ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై

` పొత్తు ముగిసిందని ప్రకటన
` టీవీకేకు మద్దతివ్వడంపై ఆగ్రహం
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇండీ కూటమికి డీఎంకే గుడ్‌బై చెప్పింది. ఇక కాంగ్రెస్‌తో తమ పొత్తు ముగిసినట్లు వెల్లడించింది. తమకు లోక్‌సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్‌కు డీఎంకే ఎంపీ కనిమొళి తాజాగా లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీల పక్కన కూర్చోలేమని అందులో పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకేకు కాంగ్రెస్ మద్దతు తెలపడంతో డీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది.తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంపై డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నుంచి ఆ పార్టీ వైదొలగడాన్ని ఖండించారు. కూటమికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసిందని.. పాత రాజకీయ స్వభావాన్ని ఆ పార్టీ మార్చుకోలేదని ఆక్షేపించారు. కూటమి వల్లే కాంగ్రెస్‌కు రాజ్యసభ ఎంపీ, అసెంబ్లీ సీట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ద్రోహాన్ని అధిగమించి బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సైతం వ్యతిరేకించారు. స్వలాభాల కోసం కూటమి నేతలను వదులుకోవడం సరైన చర్య కాదన్నారు. ఇదీ చదవండి: విచక్షణ గాలికొదిలేసి.. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకోబోయి..