విత్తన రైతులు చిత్తు
హుజూరాబాద్, న్యూస్‌లైన్: జిల్లాలో మేల్, ఫిమేల్ హైబ్రీడ్ వరి విత్తన సాగు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఏటా అధిక దిగుబడులు సాధిస్తూ జిల్లా రైతులు రాష్ట్రానికి ఆదర్శంగా విలుస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అధికోత్పత్తి సాధించి మరోసారి సత్తా చాటుకోనున్నారు. అయితే అంచనాలకు మించి వచ్చే దిగుబడులను కొనుగోలు చేసేందుకు విత్తన కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి.
దీంతో ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో దిక్కుతోచక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 66వేల ఎకరాల్లో హైబ్రీడ్ వరి విత్తనాన్ని సాగు చేస్తున్నారు. హైబ్రీడ్ విత్తనాలను సాగు నిమిత్తం రైతులకు అందించి, వారు పండించిన పంటను కంపెనీలు కొనుగోలు చేస్తాయి.
ఈ ధాన్యాన్ని విత్తన కంపెనీలు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో మార్కెటింగ్ చేస్తాయి. ఈ మేరకు ముందుగానే ఇటు రైతులతో, అటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తాయి. ఈ ఏడాది అనుకున్నదాని కంటే అధిక దిగుబడి రానుండడంతో మార్కెటింగ్ చేయడం ఇబ్బందిగా మారిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. దీంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకే పరిమితం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత రబీకి సంబంధించిన ధాన్యాన్ని ఇప్పటికీ కొన్ని కంపెనీలు నిల్వ ఉంచాయి. మరో నెలరోజుల్లో కొత్త పంట చేతికందనుంది. ఈ నిల్వలను మార్కెటింగ్ చేయలేక, ఇటు రైతులకు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేక ప్రస్తుతం కొన్ని కంపెనీలు చేతులెత్తేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విభా సీడ్స్ కంపెనీ జిల్లాలోని రైతులకు రూ. 5కోట్లు బకాయిపడింది. బాధిత రైతులు ఇటీవల హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తాజాగా మరో మూడు హైబ్రీడ్ వరి విత్తన కంపెనీలు చేతులెత్తేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా రైతులకు రూ. 10 కోట్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పెరిగిన సాగు..
జిల్లాలో ఒక్క కంపెనీతో మొదలైన మేల్, ఫిమేల్ వరి విత్తన సాగు క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సుమారు 25 కంపెనీలు ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి . కంపెనీలు స్థానికంగా కమీషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అనుకూలమైన వ్యవసాయ భూములను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా రైతులకు హైబ్రీడ్ విత్తనాలను ఇవ్వడంతో చాలామంది ఆసక్తి చూపించారు. సాధారణంగా ఎకరానికి నాలుగు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ఈసారి రెట్టింపు స్థాయిలో ఉత్పత్తి అవుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ప్రణాళిక లో పంతో అడిగిన వారందరికీ విత్తనాలను సరఫరా చేసి ఇప్పుడు వచ్చిన దిగుబడిని మార్కెటింగ్ చేయాలంటే వెనుకంజవేస్తున్నాయి. ఒక్కోరైతుకు ఒప్పందం ప్రకారం క్వింటాల్‌కు రూ. 5వేల చొప్పున ఇవ్వడానికి ససేమిరా అంటున్నట్లు తెలిసింది.
కమీషన్ ఏజెంట్ల క్కుర్తి
కొన్ని కంపెనీలకు చెందిన కమీషన్ ఏజెంట్లు రైతులను అడ్డగోలుగా ముంచుతున్నారు. క్వింటాల్‌కు రూ. 400 నుంచి రూ. 500 వరకు కమీషన్ తీసుకుంటూ కంపెనీలకు, రైతులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. వీణవంక మండలానికి చెందిన పలువురు ఏజెంట్లు కంపెనీల నుంచి రైతుల ధాన్యపు డబ్బులు తెచ్చుకొని సొంతానికి వాడుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇటీవల ఒక ఏజెంటును గదిలో నిర్భంధించిన సంఘటన జరిగింది. మరో ఏజెంటుపై ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇలా చాలా మంది ఏజెంట్లు రైతుల డబ్బులతో కోట్లకు పడగలెత్తుతున్నారు. కంపెనీలు, ఏజెంట్ల నిర్వాకంతో రైతులు మోసపోతున్నారు. కంపెనీలకు ధాన్యాన్ని అప్పగించే ముందే డబ్బులు తీసుకుంటే రైతులకు లాభం జరిగే అవకాశం ఉంది.