విదేశీ విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేయాలి

బాగ్‌లింగంపల్లి: నాణ్యమైన విద్య పేరుతో విదేశీ విద్యాసంస్థలు మనదేశంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకువస్తున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ చుక్కారామయ్య అన్నారు. ఆలిండియా లాయర్స్‌ అసోసియేషన్‌ (ఐలు) ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య కళానిలయంలో ఉన్నత విద్య పరిశోధన బిల్లు-2012, విదేశీ విద్యా సంస్థల బిల్లు 2010పై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ. దేశంలో సుమారు 160 విదేశీ విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, ఇవి కాకుండా మళ్లీ కొత్త వాటిని ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. ఎవరి స్వలాభం కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేశభక్తులంతా కలసి ఉధ్యమం చేపట్టి, ఈ బిల్లులను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ఉన్నత విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సింది పోయి, మరింత బలహీన పరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్య మనదేశానికి గొడ్డలి పెట్టువంటిదన్నారు. ఈ బిల్లులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. నల్సార్‌ యూనివర్శిటీ ప్రొ. మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ ఉన్నత విద్య పరిశోధన బిల్లు, విదేశీ యూనివర్శిటీ బిల్లు మనదేశ ప్రయోజనానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ఇప్పటికే 14 సంస్థల కౌన్సిల్‌ అధికారాలు కుదించబడ్డాయని, ఇక ఇప్పుడు వచ్చే బిల్లులతో విద్యావ్యవస్థ మరింత అదుపు తప్పుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ బార్‌కౌన్సిల్‌ ఛైర్మన్‌ నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ విదేశీ విద్య వారి స్వప్రయోజనాల కోసమేనన్నారు. దీనికి కేంద్రం వెంటనే ఆడ్డుకట్ట వేయాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐలు రాష్ట్ర అధ్యక్షుడు జి.విద్యాసాగర్‌ మాట్లాడుతూ విదేశీ విద్య బిల్లులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలతో కలసి ఉధ్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జాటా అధ్యక్షుడు డా.బి.సత్యనారాయణ, ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌ సభ్యుడు డీటీ.వినోద్‌కుమార్‌, హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.నాగేశ్వర్‌రావు, సత్యం, కె.సత్యనారాయణ, సంపత్‌సాంబశివన్‌, జనార్ధన&, మధు సూధన్‌, హరిష్‌, పార్ధసారధి, రమాదేవి, నారాయణ, ఏవీ.నాగేశ్వర్‌రావు, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.