విద్యతోనే అభివృద్ధి
– మైనారిటీ గురుకుల పాఠశాలలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
హైదరాబాద్,జూన్ 27(జనంసాక్షి): రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటి సిఎం మహ్మూద్ అలీ అన్నారు. మైనార్టీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈమేరకు నగరంలోని కిషన్‌బాగ్‌లో ఉన్న ఎంఎం గూడలో తెలంగాణ ముస్లిం మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌కు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభోత్సవం చేశారు. మైనారిటీల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మహమూద్ అలీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం మైనారిటీ బాలికలను పలకరించారు. ముస్లిం మైనారిటీల సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం దేశంలోనే పేరుతెచ్చుకుందని మరోమంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాప్రాల్‌లోని కిందిబస్తీలో సోమవారం ఉదయం ఆయన మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 120 ముస్లిం మైనారిటీ గురుకుల పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించినట్లు వివరించారు. జిల్లాలో మైనారిటీ విద్యార్థులకు రూ.180 కోట్లతో 9 పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షాదీముబారక్ పథకం కింద జిల్లాకు చెందిన 5,700 మంది యువతుల పెళ్లిళ్లకు రూ.51వేల చొప్పున అందజేసినట్లు చెప్పారు.