విద్యాభివృద్దితోనే బంగారు తెలంగాణ

గురుకులాలతో నెరవేరుతున్న లక్ష్యం

మెదక్‌,నవంబర్‌21 (జనం సాక్షి)  : సీఎం కేసీఆర్‌ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి విప్లవాత్మక మార్పుల ద్వారా శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పాటుకు సీఎం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందిగా అభివర్ణించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత విద్యకేనని అన్నారు. ప్రభుత్వ విధానంలో ఉచితంగా కేజీ టు పీజీ విద్యా విధానానికి బీజం నాటిన కేసీఆర్‌ మన దేశం లో కొత్త విద్యా విధానానికి నాంది పలికారన్నారు. కెసిఆర్‌ పట్టుదల వల్ల విద్యా రంగంలో అనేక గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు అందిస్తున్న సహకారం వల్ల తాను నియోజక అభివృద్ధికి కృషి చేయగలుగుతున్నట్లు తెలిపారు. విద్యార్ధులకు విద్యతో పాటు మంచి క్రీడా సహాయం అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.