విద్యాభివృద్ధికి రూ.26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
మెదక్ జిల్లాలో ‘ఇందిరమ్మబాట’
మెదక్, అక్టోబర్ 30 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం విద్యపై 26వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా రెండవరోజు మంగళవారం మెదక్ పట్టణంలో సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలో డార్మెటరీ, పాఠశాల వేరు వేరుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గురుకుల పాఠశాలలో ఉత్తమ ప్రతిభ చూపిన వందమందిని ఎంపిక వారికి ఐ.ఐ.టి.లో శిక్షణ ఇవ్వగా 18మంది ఐ.ఐ.టి.కి ఎంపికైనారని ఆయన పేర్కొంటూ, ప్రభుత్వం పాఠశాలలో చదివిన వారికి ఎక్కువ సీట్లు వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరింత పెంచడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ గురుకుల పాఠశాలకు డార్మెటరీ, జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ, సుచిరత అనే విద్యార్థినితో నీవు ఏమీ అవ్వాలని కోరుకుంటున్నావని ప్రశ్నించగా.. ఐ.ఎ.ఎస్. అవుతానని తెలిపింది. ముఖ్యమంత్రి ఐ.ఎ.ఎస్ అయితే ఏమీ చేస్తావని ప్రశ్నించగా, పేద ప్రజలకు సేవలు అందిస్తానని జవాబు ఇచ్చిందా విద్యార్థి. అందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ, కష్టపడి చదివితే సాధించలేనిది ఏది లేదని హితబోధ చేశారు. పల్లవి అనే విద్యార్థినితో నీవు ఏమీ కావాలని ప్రశ్నించగా… డాక్టరును కావాలని ఆమె సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ, డాక్టర్ అయితే ఏమీ చేస్తావో తెలపాలని సూచించగా, పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని విద్యార్థి తెలిపింది. డాక్టర్ కావాలంటే ఏమీ చేయాలని సి.ఎం. ప్రశ్నించగా, విద్యార్థి స్పందిస్తూ బై.పి.సి చదవాలని జవాబు ఇచ్చింది. ఎంత శాతం మార్కులు సాధించాలని అడుగగా, 90 శాతం మార్కులు సాధించాలని విద్యార్థి తెలిపింది. కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి గురుకుల పాఠశాల విద్యార్థినులతో కలిసి సామూహిక అల్పాహారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మెదక్ చర్చిని సందర్శించి ప్రార్ధనలు నిర్వహించారు. అంతేగాక చర్చి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో 7.70 కోట్ల వ్యవయంతో చేపట్టే మెదక్ రామాయణ పేట ఆర్.అండ్.బి. రోడ్డు, 3 కోట్ల వ్యయంతో చేపట్టే మెదక్ చెగుంట ఆర్. అండ్.బి. రోడ్డు వెడల్పు పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. అదే విధంగా 76లక్షల వ్యయంతో చేపట్టే 33/11 కె.వి. సబ్-స్టేషన్‌కు శంఖుస్థాఫన చేశారు. 1.30కోట్ల వ్యయంతో చేపట్టిన శివనూర్ 33/11 కె.వి. సబ్-స్టేషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డి.కె. అరుణ, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునితాలక్ష్మారెడ్డి, స్థానిక శాసనసభ్యులు హన్మంతరావు, నర్సారెడ్డి, మెడ్చల్ శాసనసభ్యులు కె. లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.