విద్యార్థి దశ ఎంతో కీలకం

మంచి జీవితం కోసం బాటలు వేసుకోవాలి
నన్నయ్య యూనివర్సిటీ కార్యక్రమంలో వెంకయ్య ఉద్బోధ
రాజమహేంద్రవరం,నవంబర్‌6(జ‌నంసాక్షి): మనిషి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల కోసం కాకుండా, వ్యక్తితంలో మార్పు కోసం చదవాలన్నారు.  రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించి వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.విద్యార్థులు అన్ని భాషలూ నేర్చుకోవాలని, అయితే మాతృభాషను మాత్రం మరిచిపోవద్దన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను ఎన్నటికీ మరువరాదన్నారు. పరిశ్రమల స్థాఫనకు ముందుకొచ్చే యువతకు కేంద్ర ప్రభుత్వం రుణాలిస్తోందని, వాటిని వినియోగించుకుని వారు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చాలా మంచివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాయలం కంటే ముందే రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజీ ప్రారంభమైందని తెలిపారు. ప్రతి విద్యార్థి కూడా కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తెలిపారు. చదువు మార్కులనే కాదు.. ఆత్మసంతృప్తిని ఇవ్వాలని తెలిపారు. ఆదికవి నన్నయ్య స్పూర్తితో విశ్వవిద్యాలయం విద్యార్థులు అందరూ అత్యున్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గ్రావిూణ ప్రాంతంలో, రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ… నిరంతర శ్రమతోనే చంద్రబాబునాయుడు ఈ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎంతో శ్రమపడి ప్రపంచంలోనే జనం మెచ్చిన మహానాయకుడిగా ఎదిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌
నరసింహన్‌, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విద్యను వ్యాపారంగా మార్చరాదు: గవర్నర్‌
విద్యాలయం అంటే సరస్వతి నిలయమని అందులోకి లక్ష్మిని చేరనివ్వరాదని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. యూనివర్సిటీకి నన్నయ్య పేరు పెట్టడం చాలా పెద్ద బాధ్యత అని తెలిపారు. నన్నయ్య ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా వ్యాపింపచేసేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా సంప్రదాయాలను మర్చిపోవద్దని విద్యార్థులకు తెలిపారు. డిసెంబర్‌ 31లోగా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు రెడ్‌క్రాస్‌తో కలిసి రక్తదానం చేయాలని కోరారు. దీని ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన వారు అవుతారని తెలిపారు.
విద్యారాజధానిగా రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్‌కు విద్యా రాజధానిగా రాజమహేంద్రవరం కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు నన్నయ్య యూనివర్సటీకి గర్వకారణమైన రోజు అని అన్నారు. వెంకయ్యనాయుడు చేతుల విూదుగా ప్రారంభమైన ఎన్‌టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ని 800 మంది కూర్చొనే విధంగా రూ.12 కోట్లు వెచ్చించి నిర్మించామని తెలిపారు. విదేశాల్లో చదువుకోనేందుకు పేద విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున స్కాలర్‌షిప్స్‌ ఇస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికమంది యువత భారతదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చూస్తున్న ఉత్సాహం చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అందరు కృషి చేసి ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా తయారు చేసుకోవాలని తెలిపారు. ఉపాధ్యయులు క్లాస్‌ రూంలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యను బోధించాలని, విద్యార్థుల్లో ఉన్న ఒత్తిడి తగ్గించాలని పేర్కొన్నారు. ఇకపోతే   ఉభయగోదావరి జిల్లాలు రాష్టాన్రికే  తలమానికమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.  తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో తాను, విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో వెంకయ్యనాయుడు చదువుకునే రోజుల్లో చాలా ఉత్సాహంగా ఉండేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. అత్యధిక మంది యువకులున్న దేశం మనది. భవిష్యత్‌లో ప్రపంచ టెక్నాలజీకి నాయకత్వం వహించేంది మనమే. ప్రముఖ సంస్థలు మైక్రోసాప్ట్‌, గూగుల్‌కు భారతీయులే సీఈవోలుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రతిభకు మారుపేరు. విద్యార్థులను ఉత్సాహపరిచేందుకే ప్రభుత్వం ప్రతిభా అవార్డులు ఇస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్టాభ్రివృద్ధి ఎంతగానో సహకరించారు. ఆయన ఇప్పుడు రాజకీయాలు చేయలేకపోవచ్చు గానీ.. రాష్టాన్రికి  అండగా మాత్రం ఉంటారు. ఓ సాధారణ వ్యక్తి పట్టుదలతో, అకుంఠిత దీక్షతో భారతదేశ రెండో అత్యున్నత పదవిని అధిష్టించడం తెలుగువారికే గర్వకారణం’ అని చంద్రబాబు అన్నారు.

తాజావార్తలు