విద్యార్థి సమ్యలను విస్మరించిన సర్కార్
నిజామాబాద్,జూన్2(జనం సాక్షి): విద్యారంగ సమస్యల పరిస్కారంలో సిఎం కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఎబివిపి విమర్శించింది. కేవలం ప్రకటనలకే పథకాలు పరిమితం అయ్యాయని అన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ సక్రమంగా అమలు కావడం లేదన్నారు. కెజి టూ పిజి అని ఊదరగొట్టి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమ సమయంలో వేలాది ఉద్యోగావకాశాలు వస్తాయని, ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడతాయని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతగా మారారని ఏబీవీపీ జిల్లా నాయకులు ఆరోపించారు. మూడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..ఎన్ని హావిూలు ఇచ్చారో ప్రకటించాలని అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ప్రచారాలతో ఊదరగొడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేవలం ఆయన ఇంటినే బంగారంగా మార్చుకొంటున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సకాలంలో ఫీజు రీఎంబార్స్‌మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమౌతున్నారని అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సైతం వెనుకాడమని హెచ్చరించారు. వెంటనే ఉపకారవేతనాలు, ఫీజు రీఎంబార్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లో నెలకొన్న అసౌకర్యాలపై ఏబీవీపీ ఆధ్వర్యంలో పోరు ముమ్మరం చేయాలని కార్యకర్తలకు సూచించారు.