విద్యార్థులకు శాపంగా ఇంటర్ బోర్డు తప్పిదాలు
మండిపడ్డ తల్లిదండ్రులు..బోర్డు ముందు ఆందోళన
హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): ఇంటర్‌బోర్డు ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. పేపర్లు దిద్దకుండా ఇష్టానుసారంగా మార్కులు వేశారంటూ ఆరోపించారు. అర్హత లేనివాళ్లతో పేపర్లు
దిద్దించారని అనుమానం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇంటర్‌లో ఫెయిల్ కారణంగా ఇప్పటికే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తప్పులతడక విధఆనాలపై తల్లిదండ్రులుమండిపడ్డారు. మరోవైపు గత ఏడాది కంటే ఈ సారి ఇంటర్ ఫలితాల విడుదల ఆరు రోజులు ఆలస్యమైంది. మూల్యాంకనం, ఇతర పక్రియలు పూర్తయిన తర్వాత రోజుల తరబడి ఫలితాలను సరిచూసుకున్నారు. అయినా సరే ఫలితాల్లో భారీగా తప్పులు చోటుచేసుకున్నాయి. ధ్రువపత్రాల్లో మార్కులు ఉండాల్సిన చోట గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏఎఫ్, ఏపీ అని ముద్రించారు. ఇలా ఒక్కరికీ…ఇద్దరికీ కాదు…దాదాపు 21 వేల మందికి ఇదే పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దాంతో విద్యార్థులు పరీక్షకు హాజరైనా…గైర్హాజరయ్యారని, బాగా రాసినా తప్పారని ఫలితం ఇచ్చారేంటని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఫలితాల విడుదల తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు చాలా వరకు ఆ పొరపాట్లను సరిదిద్దినట్లు తెలిసింది. అధికారులు శుక్రవారం సైతం దానిపై కసరత్తు చేసి ఫలితాల్లో లోపాలు లేకుండా చేసినట్లు సమాచారం. దీనిపై శుక్రవారం ఓ కార్పొరేట్ కళాశాల విద్యార్థులు ఇంటర్‌బోర్డుకు వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఈరోజు సెలవు అంటూ చెప్పి పంపారు. రోజుల తరబడి ఫలితాలను సరిచూసుకున్నా ఎందుకు వేల మందికి మానసిక ఆందోళన కలిగించారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాంకేతికంగా సరైన నైపుణ్యం లేకపోవడమే ప్రధాన లోపమన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇలాంటి సమస్యలు రాలేదని చెబుతున్నారు. ఫలితాల్లో పొరపాట్లపై పత్రికల్లో వార్తలు రావడంతో శుక్రవారం ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ స్పందించి ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు పరీక్షకు హాజరైనా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లు బ్లాంక్ బార్ కోడ్ వివరాలు ఇంటర్‌బోర్డుకు సమర్పించనందువల్ల సదరు విద్యార్థుల స్జబెక్టుల మార్కులు ధ్రువపత్రాల్లో ప్రతిఫలించలేదని తెలిపారు. అలాంటి అధికారులపై ఏమి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి. ఏఎఫ్ అంటే ఆబ్సెంట్ అండ్ ఫెయిల్‌గా పేర్కొనగా…ఏపీ అంటే ఏమిటో మాత్రం ప్రకటనలో వివరించకపోవడం గమనార్హం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందరాదని, ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా హెల్ప్ డెస్కు నంబరు 040 24600110లో సంప్రదించవచ్చని కార్యదర్శి సూచించారు.