విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.

 

విద్యార్థి సంఘాల డిమాండ్.
పోటో: గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు.
బెల్లంపల్లి,సెప్టెంబర్18,(జనంసాక్షి) బెల్లంపల్లి మండలం లంబడితండా తాళ్ళగురిజాల తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలురపాఠశాల, కళాశాల(టీఎస్ డబ్ల్యూ ఆర్జేసి) ముందు ఐక్యవిద్యార్థి సంఘాలు ఏఐఎఫ్డిఎస్ జిల్లాకార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, బీసీవిస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి సాగర్, టిజివిపి జిల్లా అధ్యక్షులు మురళి శ్రావణ్, పిడీఎస్యు జిల్లా అధ్యక్షులు రెడ్డి చరణ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ వజ్రోత్సవాలలో భాగంగా శనివారం ప్రిన్సిపాల్, పీఈటీ విద్యార్థులతో బెంచీలు మోపించడంతో పాటు వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆరవ తరగతి విద్యార్థి కిందపడి చేతి విరిగిందన్నారు. 10:30గంటల సమయంలో బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా మంచిర్యాల ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లాలని వైద్యులు చెప్పగా అక్కడికి తీసుకెళ్ళకుండా తిరిగి హాస్టల్ కు తీసుకెళ్లి విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపారని, వారు వచ్చాక ఆసుపత్రికి తీసుకెళ్తారని దాదాపు 3 గంటల (మధ్యాహ్నం1:30) వరకు చికిత్స అందించకుండా కాలయాపన చేస్తూ తల్లిదండ్రులకు అప్పచెప్పి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ,అమర్యాదగా ప్రవర్తిస్తూ, మెరుగైన వైద్యం అందించకుండా, అధికారులకు తెలుపకుండా తన ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు, లేని యెడల పెద్ద ఎత్తున దశాలవారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.