విద్యుత్తు కోతలపై ముందస్తు చర్యలు

చిత్తూరు,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వేసవిలో విద్యుత్తు కోతలు అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ట్రాన్స్‌కో అధికారులు వెల్లడించారు. మెరుగైన విద్యుత్తు సరఫరా, వేసవిలో విద్యుత్‌ కోతల్ని అధిగమించడంపై దృష్టి సారించినట్టు వివరించారు. ఇందులో భాగంగా అన్ని విద్యుత్తు ఉపకేంద్రాలను తనిఖీ చేస్తూ.. నాణ్యమైన సరఫరాకు చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 350 విద్యుత్తు ఉపకేంద్రాలు ఉన్నాయని, కొత్తగా విద్యుత్తు ఉపకేంద్రాలు నిర్మించాల్సిన అవసరమ లేదని తేల్చిచెప్పారు. కొన్నిచోట్ల వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నట్టు ఫిర్యాదులు అందాయని, దాన్ని పరిష్కరించడంపై దృషి సారించామని చెప్పారు. రైతులు సోలార్‌ పంపుసెట్లు వినియోగించే దిశగా చితన్యం కావాలని సూచించారు. రైతులు రూ.55 వేలు చెల్లిస్తే..రూ.5 లక్షల విలువైన సామగ్రి అందిస్తామని స్పష్టం చేశారు. ఇదిలావుంటే  శాంతిపురంమండల పరిధి అమ్మవారిపేట వద్ద విమానాశ్రయం ఏర్పాటు ప్రతి పాదిత భూములకు సంబంధించిన రైతులతో రెవెన్యూ అధికారులు  సమావేశాలను నిర్వహించారు. అమ్మవారిపేట, విజలాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.  భూములను కోల్పోయే రైతు కుటుంబాల్లోని నిరుద్యోగులకు విమానాశ్రయంలో ఉపాధి కల్పించాలని కోరారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాలని కోరారు. శాంతిపురం, రామకుప్పం మండలాల పరిధిలో 1,100 ఎకరాల భూములను విమానాశ్రయం కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో విమానాశ్రయం స్థాపనకు అవసరమైన భూమిని ప్రభుత్వపరంగా సేకరించనున్నట్లు తెలిపారు. రైతులకు పరిహారంగా ప్రతి ఎకరాకు రూ.50 వేలను ప్రభుత్వం ద్వారా అందజేస్తామన్నారు. దీనిపై రైతులు మాట్లాడుతూ  పరిహారాన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతామని అధికారులు తెలిపారు.