విద్యుత్‌షాక్‌తో గిరిజన రైతుల మృతి
మరో ఇద్దరికి తప్పిన ప్రాణాపాయం
గాలివానతో తెగిన వైర్లు.. సరిచేయకపోవడంతో ప్రమాదం
అధికారుల తీరును నిరసిస్తూ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా
నష్టపరిహారం చెల్లిస్తామనే హామితో ఆందోళన విరమణ
పస్పుల (ఖానాపూర్), జనంసాక్షి: కరెంట్ కాటుకు ఇద్దరు గిరిజన రైతులు బలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత అధికారుల నిర్లక్ష్యం వీరి ప్రాణాలు తీసింది. రెండు కుటుంబాలు వీధిన పడ్డాయి. వీరి పిల్లలు అనాథలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఖానాపూర్ మండలంలో సోమవారం గాలి దుమారం రేగింది. దీనికి తోడు భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని పస్పుల గ్రామ శివారులో గల కడెం వాగులో 33 కేవీ విద్యుత్ తీగల తెగి కింద పడ్డాయి. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పస్పుల గ్రామానికి చెందిన గిరిజన రైతులు రెడ్డి నర్సయ్య, పాముల మల్లేష్, మీసాల భీమయ్య, చుంచు అడెల్లులు కలిసి పొలం వద్దకు వెళ్తున్నారు.వాగు దాటుతున్న క్రమంలో విద్యుత్ తీగలను గమనించకుండా వాటిపై నుంచి వెళ్లడంతో విద్యుత్ షాక్‌కు గురై నర్సయ్య(35), మల్లేష్(32) అక్కడికక్కడే మృతి చెందారు. భీమయ్య, అడ్డెలుకు తీవ్రగాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన కర్రె గంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పెంబి ఏఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.