విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల మోత

1

హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. సగటున 7.5శాతం మేర ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 యూనిట్లలోపు వినియోగాదారులకు పెంపు నుంచి మినహాయింపు లభించింది. 100 నుంచి 200 యూనిట్ల వరకు రూ.3.60 నుంచి 4.30కి, 201 300 వరకు రూ.6.80 నుంచి రూ.7.20కి, 401-800 వరకు రూ.8.50 నుంచి రూ.9కి యూనిట్ల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు చార్జీల పెంపు వల్ల విద్యుత్‌ సంస్థలకు రూ.1600 కోట్ల ఆదాయం లభించనుంది. వినియోగదారులపై రూ.1527 కోట్ల భారం పడనుంది. పెరిగిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఈ మేరకు సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఛార్జీల పెంపును అధికారికంగా ప్రకటించారు. బుధవారం సిఎం కెసిఆర్‌ సవిూక్షించనమేరకు ఛార్జీల పెంపును మంత్రిప్రకటించారు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోవిూటర్ల వరకు రూ.1, 30 కిలోవిూటర్లు దాటితే రూ.2 పెంచుతున్నట్లు తెలిపారు. సిటీ బస్సులు, డీలక్స్‌, ఏసీ బస్సుల్లో 10 శాతం ఛార్జీలు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలపై భారం మోపే ఉద్దేశం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఛార్జీలు పెంచాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ఆర్టీసీని నష్టాల ఊబిలోంచి బయట పడేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు తమ ముందున్న తక్షణ చర్యగా ఛార్‌ఈజల పెంపు నిర్ణయం తసీఉకోవాల్సి వచ్చిందన్నారు. పక్క రాష్ట్రాలైన  ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలో గత సంవత్సరమే ఆర్టీసీ ఛార్జీలు పెంచారని… తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏడాది ఆలస్యంగా ఛార్జీలు పెంచుతోందన్నారు. పెరిగిన ఛార్జీలు 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీలో త్వరలో 1200 కొత్త బస్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఛార్జీల పెంపు అనివార్యమైందని  తెలిపారు. కాగా పెంచిన ఛార్జీలతో ఆర్టీసీకి రూ.286 కోట్లు అదనపు ఆదాయం రానుంది.