విద్యుత్‌ కోతతో విలవిలాడుతున్న రైతాంగం

ఆదిలాబాద్‌, జనవరి 1 (): జిల్లాలో ఇష్టారాజ్యంగా విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో సామాన్య ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో ఎంతో పెట్టుబడి పెట్టినప్పటికీ పంటల దిగుబడి తగ్గిపోయి నష్టపోయిన రైతులకు రబీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో రబీ పంటలు వేసిన రైతులకు కరెంటు కోతతో పంటలకు నీరు ఇవ్వక ఎండిపోతున్న పంటలను చూసి విలవిలలాడుతున్నారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు కరెంటు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎక్కడా అది అమలు కావడం లేదు. అప్రకటిత కోతల వల్ల  రైతులు విలవిలలాడుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్‌కోతలు విధిస్తుండటంతో కరెంటు కోసం గంటలు తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. గత ఏడాది ప్రారంభంలో సరైన వర్షాలు లేక రైతులు ఆందోళనలో ఉంటే ఆ తర్వాత అధికవర్షాలు కురిసి రైతులను తీవ్ర నష్టానికి గురిచేశాయి. ఖరీఫ్‌లోనష్టపోయిన రైతులకు రబీ అయినా ఆదుకుంటుందని అనుకుంటే విద్యుత్‌ కోతలవల్ల రైతులకు మరిన్ని నష్టాలు తప్పడం లేదు. జిల్లాలో ఈ ఏడాది రబీలో లక్ష హెక్టార్లకు పైగా పంటలు సాగు అవుతాయని అనుకుంటున్న తరుణంలో వాతావరణం అనుకూలించక కేవలం 60వేల హెక్టార్లలోనే పంటలు సాగు అవుతున్నా దానికి అనుగుణంగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పంటలకు నీరు ఇవ్వక ఎండిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఈ రబీలో గోధుమ, మొక్కజొన్న, శెనగ, పెసరులు, మినములు ప్రధానంగా సాగవుతున్నాయి. వీటితో పాటు  రైతులు కూరగాయలను కూడా సాగుచేస్తున్నారు. సకాలంలో పంటలను నీరు అందక రబీలో కూడా రైతులు నష్టపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పటికైన ప్రభుత్వం కనికరించి వ్యవసాయానికి 7గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలని జిల్లా రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నారు.