విద్యుత్‌ చార్జీలు ఎవరు పెంచారు ?

విపక్షాలది అనవసర రాద్ధాంతం
భూదాన్‌రైతులకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం
హైదరాబాద్‌,జనవరి 12 జనంసాక్షి):
విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలపై విపక్షాలు, విూడియా రాద్దాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. చార్జీలు పెంచాలనేది కేవలం ప్రతిపాదనేనని, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. విద్యుత్‌ చార్జీలు పెంచాలని డిస్కంలు ప్రతిపాదనలు పంపాయని, వీటిపై మంత్రుల కమిటీ మార్చీలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంత్రులు తయారు చేసిన ప్రతిపాదనలపై ఏప్రిల్‌ 1న ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విద్యుత్‌ నియంత్రణ సంస్థ చార్జీలు పెంచాలని నిర్ణయించినా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం పేదల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వమని.. పేదలకు ఇబ్బంది కలిగించే ఏ నిర్ణయంతీసుకోదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, వచ్చే ఉగాది నుంచి ఆరు రకాల వస్తువులను సబ్సిడీపై సరఫరా చేయనున్నట్లు పునరుద్ఘాటించారు. శనివారం జూబ్లీహాల్‌లో జరిగిన కార్యక్రమంలో భూదాన్‌ రైతులకు నష్ట పరిహారం అందజేశారు. 75 కుటుంబాలకు రూ.11.25 కోట్ల పరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ డబ్బుతో స్థిరాస్తి కొనుగోలు చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. వినోభా భావే పిలుపు మేరకు మన రాష్ట్రంలో రామచంద్రారెడ్డి పోచంపల్లిలో భూదానోద్యామాన్ని ప్రారంభించారన్నారు. వినోభా, రామచంద్రారెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వీరి స్ఫూర్తితోనే 1970-71లో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నర్సింహారెడ్డి భూ సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. రామచంద్రారెడ్డి మూలంగానే ల్యాండ్‌ సీలింగ్‌ అమల్లో తెచ్చారని చెప్పారు. అప్పట్లో వచ్చిన భూముల ఆధారంగా ఇప్పటివరకు 52 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలకు భూమి చాలా అవసరం ఉందని సీఎం అన్నారు. మరోవైపు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రజల నుంచి 6-7 లక్షల ఎకరాలు తీసుకుంటుందన్నారు.
అనవసర రాద్దాంతం..
విద్యుత్‌ చార్జీల పెంపుపై పేదల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కిరణ్‌ మండిపడ్డారు. కొందరు తెలిసీ తెలియకుండా అనవసవర రాద్దాంతం చేస్తున్నారని విపక్షాలు, విూడియాపై ధ్వజమెత్తారు. పేద వారి గుండె తెలిసిన ప్రభుత్వం, పేద వారిని ఆదుకొనే ప్రభుత్వం తమదన్నారు. రూ.26 వేల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, 8.50 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని వివరించారు. విద్యుత్‌ చార్జీలపై విపక్షాలు, విూడియా అనవసరంగా భయాందోళన సృష్టిస్తున్నాయన్నారు. పేదలకు వాస్తవం తెలియాలని.. అందుకు సంబంధించిన లెక్కలను వివరించారు. గతేడాది మార్చ్‌ వరకు రాష్ట్రంలో కరెంట్‌ డిమాండ్‌ 88 వేల మిలియన్‌ యూనిట్లు ఉండేదని చెప్పారు. జల విద్యుత్‌, గ్యాస్‌, బొగ్గు ద్వారా 77 వేల మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేశామని, 10 వేల ఎంయూల లోటు ఏర్పడిందన్నారు. ఈ లోటును భర్తి చేసేందుకు బయటి నుంచి అధిక ధరకు కరెంట్‌ కొనాల్సి వచ్చిందన్నారు. గతేడాది యూనిట్‌కు రూ.4.44 ఖర్చు అయ్యిందన్నారు. జల విద్యుత్‌ ద్వారా 6.50 వేల ఎంయూల విద్యుత్‌ ఉత్పత్తి అయ్యేదని, కానీ గతేడాది ప్రాజెక్టులో నీరు లేక 3.50 వేల ఎంయూల ఉత్పత్తి మాత్రమే జరిగిందన్నారు. ఇక, గ్యాస్‌ ద్వారా 11 వేల మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ ఉత్పత్తి కావాల్సి ఉండగా, గ్యాస్‌ కొరత వల్ల కేవలం 5 వేల ఎంయూల విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి అయ్యిందన్నారు. నీటితో ఉత్పత్తయ్యే కరెంట్‌కు రూ.2.25, గ్యాస్‌తో అయితే యూనిట్‌కు రూ.3.50 మాత్రమే ఖర్చవుతుందన్నారు. అయితే, నీరు, గ్యాస్‌ కొరత కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. దీంతో బయటి నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేశామని.. ఒక్కో యూనిట్‌కు రూ.5 వెచ్చించాల్సి వచ్చిందన్నారు. దాని మూలంగానే ప్రజలపై సర్‌చార్జీ భారం వేయాల్సి వచ్చిందని వివరించారు.
ఈ ఏడాదీ భారం తప్పదు..
ఈ ఏడాది కూడా విద్యుత్‌ రేట్లు భారీగా పెరగనున్నాయని సీఎం తెలిపారు. ఈ ఏడాది 1.06 లక్షల మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంటుందని, కానీ 84 వేల ఎంయూలు మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందన్నారు. 22 వేల మిలియన్‌ యూనిట్ల లోటు ఏర్పడనుందని చెప్పారు. ఇందుకోసం రూ.42 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అంటే, యూనిట్‌కు రూ.10 వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఆ భారం ప్రజలపై పడుతుందని తెలిపారు. ఈ ఏడాది విద్యుత్‌ డిమాండ్‌, ఉత్పత్తిని అంచనా వేసి డిస్కంలు చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించాయన్నారు. దానిపై విద్యుత్‌ నియంత్రణ సంస్థ (ఈఆర్‌సీ) ప్రజాభిప్రాయ సేకరణ చేసి, ఎంత మేర విద్యుత్‌ చార్జీలు పెంచాలనేది నిర్నయిస్తుందన్నారు. ఈఆర్‌ఎసీ ధరలు పెంచినా ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇస్తుందని, తద్వారా ప్రజలపై పెద్దగా భారం పడదన్నారు. అయితే, కరెంట్‌ చార్జీల పెంచాలన్న ప్రతిపాదననే విపక్షాలు, విూడియా కలిసి రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. నాలుగు నెలల తర్వాత పెంచే చార్జీలకు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమది ప్రజల ప్రభుత్వమని, ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా చూస్తామన్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకొని పేదలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉగాది నుంచి రేషన్‌ ద్వారా చింతపండు, కారం, కందిపప్పు వంటి నిత్యావసరాల వస్తువులు తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ లేచి సిలిండర్లపై అదనపు భారం మోపారని ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో అవాక్కైన సీఎం… సిలిండర్‌ సబ్సిడీ ఎంత ఇస్తున్నామన్న విషయం విూకు తెలియదని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు. సిలిండర్‌ రేటు మార్కెట్‌ ధర ఎంతో విూకు తెలియదని, ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను సబ్సిడీ కింద ఇస్తుందన్నారు.