విధుల్లోకి అనుమతించని పోలీసులు
ఆర్టీసీ కార్మికుల ఆందోళన
నిజామాబాద్,నవంబరు 26(జనం సాక్షి): సమ్మె విరమణ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సంసిద్ధులవుతున్నా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. డిపోల వద్ద కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఎవరు కూడా రావద్దని తెలిపారు. షరతుల్లేకుండా తమను విధుల్లోకి తీసుకోవాలని, వెంటనే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆత్రుతగా ఎదురుచూశారు. మంగళవారం ఆయా డిపోల వద్ద చాలామంది కార్మికులు డ్యూటీలో చేరాలని నిర్ణయించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండకర్లు విధుల్లో చేరాలని వచ్చినా అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వెనుదిరిగారు. కామారెడ్డి డిపో వద్ద తమను డ్యూటీలో చేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం ఇంకా రాలేదని, తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పి పంపారు. ఇదే విషయాన్ని టీఎం యూ రాష్ట్ర కార్యదర్శి మురళి ధ్రువీకరించారు. ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వకపోవడంతో తాము విధుల్లో చేరే అవకాశం లభించడం లేదని తెలిపారు.
బస్ డిపోల వద్ద పటిష్ట బందోబస్తు
తమను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో డిపోల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపోల వద్దకు వస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రమే డిపోల్లోకి పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.