వినాయక మంటపాలకు ముందస్తు దరఖాస్తు
పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి
విజయవాడ,సెప్టెంబర్1(జనం సాక్షి): వినాయక చవితికి ఏర్పాట్లు చేసి, మంటపాలను పెట్టాలనుకుంటున్న వారు దరఖాస్తుతో పాటు విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జనమార్గం, వాహనం వివరాలను తెలియజేయాలని పోలీసులు సూచించారు. ఈవివరాలను తప్పనిసరిగా తెలపాలని విజయవాడ పోలీస్ అధికారుల అన్నారు. అలాగే మండపాల వద్ద నిర్వాహకులు కాపలా ఉండాలని, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయక పందిళ్లు ఏర్పాటు, ఊరేగింపులకు పోలీసు అనుమతి తప్పనిసరన్నారు. అలా లేని వాటిని తొలగించడానికి వెనకాడబోమన్నారు. పందిళ్ల ఏర్పాటుకు అన్ని శాఖల నుంచి అనుమతి తీసుకోనవసరం లేదని, పోలీస్‌శాఖ వద్ద దరఖాస్తు చేసుకుంటే మిగిలిన ప్రభుత్వ శాఖలైన నగరపాలకసంస్థ, అగ్నిమాపకశాఖ, పంచాయితీశాఖల సమన్వయం చేసుకుని పోలీసుశాఖ చవితి పందిళ్లకు అనుమతి ఇస్తాయన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక అధికారిని సమన్వయకర్తగా ఏర్పాటు చేసామని, . పందిళ్ల ఏర్పాటులో ఏమైనా సందేహాలు, సమస్యలు వచ్చినా ఆ అధికారి లేదా ఏరియా పోలీస్‌స్టేషన్ లేదా 100 నంబర్‌కు సంప్రదించాలన్నారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగా పోలీసు అనుమతి తీసుకోవాలని పోలీస్ కమిషనర్ కోరారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సవిూకృత పోలీసు సేవా కేంద్రంలో దరఖాస్తులను సమర్పించాలని అన్నారు. ఉత్సవాలకు సంబందించిన దరఖాస్తులను అక్కడ నుంచే ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేసిన నియమ నిబంధనలను, భద్రతా చర్యలను ఉత్సవ నిర్వాహకులు పాటించాలని కోరారు. లౌడ్ స్పీకర్లను ఎట్టిపరిస్థితిలోనూ వినియోగించరాదన్నారు. /రిళిడ్డుపై పందిళ్లు వేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలగచేయవద్దన్నారు. వీలైనంత వరకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. నిమజ్జన సమయంలో రంగులు చల్లటం, లౌడ్‌స్పీకర్లు వినియోగించటం, బాణసంచా కాల్చటం చేయరాదన్నారు. అలాగే పోలీసుల అనుమతి లేకుండా వేషధారణ, ఎక్కువ శబ్దం వచ్చే వాయిద్యాలు అనుమతించరాదన్నారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు తగిన వలంటీర్లను ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినయాక చవితిని అందరూ ఆనందంగా జరుపుకునేలా పోలీసులకు సహకరించాలన్నారు.