వినోదం దూరం

ఆర్టీసీ బస్సుల్లో కనిపించని టీవీలు

‘లగ్జరీ’ల పేరిట లక్షణంంగా దోపిడీ

టీవీలున్నా.. బిగింపు ఖర్చుల్లేవట..

ప్రయాణికులకు ఆహ్లాదం కరువు

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వైపు మొగ్గు

జనం సాక్షి, మంచిర్యాల: బహుదూరం వెళ్లే ప్రయాణికులకు ‘వినోదం’ కరువైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికుల  సౌకర్యాల లగ్జరీ సేవలో భాగంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం సూపర్‌ లగ్జరీ బస్సులో టీవీలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం టికెట్‌ రూపంలో చార్జీ కూడా వసూలు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కంటే రూ.20 నుంచి రూ.30 అధికంగా వసూలు చేస్తున్నారు. బస్సుల్లో ఏర్పాటు చేసిన టీవీలు మున్నాళ్ల ముచ్చటగానే మారాయి. జిల్లాలో ఏడాది వరకు పనిచేసిన టీవీలను అనంతరం తొలగించారు. ప్రయాణికులు గంటల కొద్ది ప్రయాణాన్ని బోరుగా సాగిస్తున్నారు. మరోపక్క ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వారు బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేసి వినోదం పంచుతూ ఆకర్షిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది.

ఎటు వెళ్లాలన్నా 200 కి.మీ. ప్రయాణం..

జిల్లాలో ఆదిలాబాద్‌, బైంసా, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, ఉట్నూర్‌ డిపోలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, నుంచి నిత్యం వేలాది మంది హైదారాబాద్‌కు వెళ్తుంటారు. ఆదిలాబాద్‌ భౌగోళికంగా పెద్దది కావడంతో ఒక  ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి దాదాపు వంద కి.మీ. పైగా ఉంటోంది. హైదరాబాద్‌కు ఆదిలాబాద్‌ మధ్య దూరం 312 కి.మీ. సూపర్‌ లగ్జరీ చార్జీ రూ.308. అదే ప్రైవేట్‌ బస్సులు వసతులను బట్టి రూ.280 నుంచి రూ. 350 వరకు తీసుకున్నారు. ఆసిఫాబాద్‌ నుంచి 315 కి.మీ.దూరంలో రాజధాని ఉంది.

లగ్జరీ చార్జీ రూ.324. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు మధ్య దూరం 258 కి.మీ. బస్సు కిరాయి రూ.223. నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌ 241కి.మీల దూరంలో ఉండగా చార్జీ రూ.222. ఇలా జిల్లాలోని ఏ మూల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలన్నా 240 కి.మీలపైనే బస్సుల్లో ప్రయాణించక తప్పదు. దానికి కనీసం ఏడు గంటలపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే ట్రాఫిక్‌ సమస్యలు ఉంటాయి. కొన్ని రూట్లలోనయితే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల్లో  ప్రయాణించాలంటే ప్రయాణికులు ‘వినోదం’ కోరుకోవడం సహజమే. కానీ ఆర్టీసీ చార్జీలు వసూలు చేస్తుంది తప్పా ప్రయాణికులకు సంతృప్తి కల్పించలేకపోతోంది.

టెండర్‌ రద్దు చేసుకున్న ఆర్టీసీ..

ప్రయాణికులను ఆకర్శించేందుకు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సూపర్‌ లగ్జరీ బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేయాలని 2010 లో నిర్ణయించిందిజ అప్పట్లో ప్రకటనదారులను ఆహ్వానించిది. ఒక ప్రైవేట్‌ కంపెనీ ముందుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేసి, నిర్వాహణ బాధ్యతలు చూసుకునేందుకు రూ.5 కోట్లతో ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. మన జిల్లాలో సుమారు 40 టీవీలు బస్సుల్లో అమర్చారు. అయితే సాంకేతిక  కారణాల వల్ల బస్సుల్లో టీవీలు నడవక, సినిమాలు (టెస్ట్‌ సిగ్నల్‌) రాక  మొదటి నాలుగు నెలలు వృథా అయ్యాయి. మరోపక్క.. బస్సులో ప్రకటనలు జారీ  చేసినప్పటికీ లాభాలు రాక సదరు కంపెనీ టీవీల నిర్వహణపై అశ్రద్ధ చూపింది. దీంతో ఆర్టీసీ ఆ కంపెనీతో టెండర్‌ రద్దు చేసుకుంది. ఈ క్రమంలో 30 టీవీలు డిపోల్లోనే ఉండిపోయాయి. 2010 నుంచి 2011 వరకు సూపర్‌ లగ్జరీల్లో టీవీలు పెట్టిన  ఆర్టీసీ ఆల తర్వాత వాటిని తీసేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు లగ్జరీ టీవీలు లేకుండానే తిరుగుతున్నాయి. టీవీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రకటనదారుల కోసం ఎదురుచూపు..

మన జిల్లాలో స్థానికంగా ప్రకటనదారులను వెతికి, వారితో ఒప్పందం కుదుర్చుకుని టీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే డిపోల్లో 45 సూపర్‌ లగ్జరీ బస్సులుంటే 30 టీవీలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి మూలకు పడేయడంతో రిపేర్‌కు వచ్చాయి. వాటిని బస్సుల్లో బిగించాలంటే ఒక్కోటీవీపై సుమారు రూ.900 ఖర్చు చేయాల్సి ఉంది. అంటే  30 టీవీలకు రూ.27 వేల అవసరం అవుతుంది. అప్పుడు నిర్వహణ బాధ్యత  ఆర్టీసీయే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే.. నిర్వహణ భారంగా భావిస్తోన్న ఆర్టీసీ బస్సుల్లో టీవీల ఏర్పాటు ప్రకటనదారులకు అంటగట్టాలని యోచిస్తుంది. సాధారణంగా ఒక్కో బస్సులో ఒకసారి టీవీ బిగిస్తే అయ్యే ఖర్చు రూ.20వేల వరకు ఉంటుంది. ఆర్టీసీ మాత్రం ఒక్కో బస్సుకు ప్రతి నెల రూ.2వేల చొప్పున చెల్లించేందుకు సిద్ధం ఉంది.

టీవీలు పునరుద్ధరించాలి..

నాపేరు ఎం. రమేష్‌. మాది మంచిర్యాల మండలం నస్ఫూర్‌ కాలనీ. నేను ఎల్‌ఐసీ ఏజెంటుగా పనిచేస్తా. తరచూ పాలసీల కోసం హైదరాబాద్‌కు వెళ్తాను. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌ దూరం కావడంతో లగ్జరీ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తుంటాను. ఏడాది క్రితం వరకు బస్సులో టీవీలు ఉండేవి. మంచి కాలక్షేపం అయ్యేది. ప్రయాణం చేసినట్టుగా ఉండేది కాదు. తర్వాత ఏమైందో తెలయదు కానీ కొన్ని బస్సుల్లో టీవీలు తీసేశారు. కొన్ని చోట్ల ఉన్నా పనిచేయడం లేదు. టికెట్‌లో చార్జీలు వసూలు చేసే ఆర్టీసీ వారు టీవీలు పునరుద్ధరించాలి.