విపక్ష సభ్యులకు రాజ్యసభలో అవమానం
రావత్‌కు నివాళి అర్పించేందుకు అవకాశం ఇవ్వరా: ఖర్గే
న్యూఢల్లీి,డిసెంబర్9(జనం సాక్షి ): తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించేందుకు విపక్ష సభ్యులను రాజ్యసభ చైర్మన్ అనుమతించలేదని పెద్దల సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాద ఘటనపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రకటన చేసిన అనంతరం ఈ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ సహా ఇతరులకు నివాళులు అర్పించేందుకు ఎంపీలందరికీ సమయం కేటాయించాలని విపక్షాలు కోరినా ప్రభుత్వం అనుమతించ లేదని ఆరోపించారు. ప్రభుత్వ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై సభ తీవ్ర దిగ్భార్రతిని సానుభూతిని వ్యక్తం చేసినందున విడివిడిగా సభ్యుల ప్రకటన అవసరం లేదని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పేర్కొన్నారు. రాజ్‌నాధ్ సింగ్ ప్రకటన అనంతరం సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపై మాట్లాడేందుకు విపక్ష పార్టీల నేతలకు కొంత సమయం కేటాయించాలని కోరినా ప్రభుత్వం, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిరాకరించారని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. సభను ప్రభుత్వం ఇష్టానుసారం నడుపుతోందని విమర్శించారు.