విభజన హామీలు సాధించని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి….

-తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన బిజెపిని తరిమి కొట్టాలి..

 

–సిపిఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు..

హన్మకొండ బ్యూరో చీఫ్ 27 సెప్టెంబర్ జనంసాక్షి

కేంద్రలో మంత్రిగా కొనసాగుతూ తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను సాధించలేని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన సిపిఐ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందన్నారు. తెలంగాణ నుండి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాద్యం కాదని, దానివలన ప్రయోజనం లేదని చెప్పడం మూర్ఖత్వం అని అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా ఓవర్ హాలింగ్ సెంటర్ వస్తుందని చెప్పడం అన్యాయం అని అన్నారు. అలాగే ములుగులో గిరిజన యూనివర్శిటీ, వరంగల్ లో సైనిక్ స్కూల్ కోసం కేంద్రం నిధులను కేటాయించకుండానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం తల పెడుతున్న బిజెపి ని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టాలని అన్నారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అద్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య,జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, జిల్లా నాయకులు మద్దెల ఎల్లేష్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, ఉట్కూరీ రాములు తదితరులు పాల్గొన్నారు.