విభజన హావిూలపై దమ్ముంటే చర్చకు రండి

బీజేపీ నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్‌
విజయవాడ, జూన్‌21(జ‌నం సాక్షి) : విభజన హావిూలపై దమ్ముంటే చర్చకు రావాలని బీజేపీ నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సవాల్‌ విసిరారు. కడపలో స్టీల్‌ ప్యాక్టరీ ఉద్యమానికి సంఘీబావంగా సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ, జనసేన, కాంగ్రెస్‌, ఆమ్‌ అద్మి పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల నేతలు విజయవాడలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. స్టీల్‌ ప్యాక్టరీ రాయలసీమ ప్రాంత ప్రజల సమస్య మాత్రమే కాదని, అది రాష్ట్ర ప్రజల సమస్య అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ.. కడపలో స్టీల్‌ ప్యాక్టరీ నిర్మాణం చేపడతామని విభజన సమయంలో హావిూ ఇచ్చారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు జరపాల్సిందేననని ఆయన పేర్కొన్నారు. ‘స్టీల్‌ ప్యాక్టరీ నిర్మాణాన్ని  రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పటి సమస్య కాదు..13వ షెడ్యుల్‌లో పొందుపరిచిన అంశం. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. ఇప్పుడు టీడీపీ రాజకీయ నాటకం ఆడుతుందని’ ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు 80శాతం హావిూలు అమలు జరిపామని చెబుతున్నారని, వారికి అసలు విభజన హావిూలపై అవగాహన లేనట్లుందని విమర్శుల గుప్పించారు. బీజేపీ నేతలు విూడియా సమక్షంలో విభజన హావిూలపై చర్చిద్దాం..  దమ్ముంటే చర్చకి రావాలని రామకృష్ణ సవాలు విసిరారు. టీడీపీ ప్రజలు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. 29వ తేదిన కడపలో జిల్లాలో జరిగే బంద్‌కు పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. అంతేకాక ఆ రోజు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు. విద్యార్థులు ఉద్యమంలో పెద్దెత్తున పాల్గొనేలా ఉద్యమాన్ని నిర్మించాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.
కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్‌, ఉత్తారాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ సాధించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్‌ బాబురావు స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు. కడప జిల్లా బంద్‌కు పూర్తిగా సంఘీబావం ప్రకటిస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆయన తెలిపారు. బీజేపీ, టీడీపీ రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజలతో ఆటలాడితే తగిన బుద్ధి చెబుతామని బాబురావు హెచ్చరించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గతంలో జరిగిన ఉద్యమాన్ని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య గుర్తు చేశారు. అదే మాదిరి ప్రస్తుతం రాష్ట్రంలో కడప స్టీల్‌ ప్యాక్టరీ సాధన కోసం అలాగే ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. అనాడు 38మంది విద్యార్థుల ప్రాణత్యాగం చేశారు.. ఎటువంటి పోరాటానికైన మేము సిద్ధంగా ఉన్నామని ఈశ్వరయ్య అన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో నిరహరదీక్షలు కాదు.. ఢిల్లీలో దీక్షలు చేయాలని ఈశ్వరయ్య హితవు పలికారు.