విభజన హావిూలు విస్మరించిన కేంద్రం

కడప ఉక్కుతోనే నిరుద్యోగులకు ఉపాధి

కడప,నవంబర్‌25 (జనంసాక్షి) : విభజన హావిూల అమలపై కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యని సిపిఎం జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. ప్రధానంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో ఏళ్లు అయినా అడుగు ముందుకు పడలేదన్నారు. ఉక్కు పరిశ్రమపై ప్రజా ప్రతినిధులు పెదవి విప్పాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయతీగా కడప ఉక్కు పరిశ్రమను నిర్మించి విభజన చట్టంలోని హావిూలను నెరవేర్చలేదని మండిపడ్డారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి చాలా అనువైన ప్రదేశమని అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆయన అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఇంతకన్న అనువైనప్రదేశం ఎక్కడ ఉండదని కావున రాయలసీమలోని ప్రజా ప్రతినిధులు కడప ఉక్కు ఫ్యాక్టరీపై ప్రేక్షక పాత్ర విడనాడి నోరు విప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ¬దా విషయంలో రాష్ట్ర ప్రజలను కేంద్రం మోసం చేసిందన్నారు. ఉత్త రాంధ్ర, రాయలసీమ జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహాలో వెనుకబడిన జిల్లాల ప్యాకేజీని ఇవ్వాల్సి ఉందని, కానీ ఒక్కో జిల్లాకు రూ.150 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున దీనిపై చర్చించాలని అన్నారు. అయితే అసెంబ్లీలో అధికార టిడిపి, బిజెపి, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలే ఉన్నారని, రాష్ట్ర సమస్యలపై ప్రశ్నించే వారే లేరని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా లేవని విమర్శించారు. ప్రత్యేక ¬దాపై ప్రతిపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీని అడ్డుకునే ప్రయత్నం చేశారే తప్ప చర్చించే సాహసం చేయడం లేదన్నారు. గత మూడున్నరేళ్లగా కేంద్ర ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగానే ఉందని, ఇప్పటికీ విభజన హావిూలు అరకొరగా అమలు చేసిందని విమర్శించారు. 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పిన పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు సకాలంలో అందక అంచనాలు పెరిగిపోతున్నాయని అన్నారు.